అగ్రరాజ్యంలో అంత దారుణ పరిస్థితులా?

Update: 2020-11-16 23:30 GMT
అగ్రరాజ్యంగా.. ప్రపంచానికి పెద్దన్నలా.. తన కనుచూపు పడితే.. ఆ దేశంలో శాంతి అన్నది లేకుండా చేసే సత్తా ఉన్న అమెరికా టైం ఇప్పుడే మాత్రం బాగున్నట్లుగా కనిపించటం లేదు. కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడా దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. అక్కడి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విరుచుకుపడుతున్న వైరస్ తో ఏం చేయాలో పాలుపోక చేష్టలుడిగినట్లుగా ఉండిపోతున్నారు అమెరికన్లు. మరోవైపు మొండి అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అని.. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా.. వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యానికి అంతులేని కష్టాల్ని తీసుకొస్తున్నాయి.
ఇప్పటికే అమెరికాలో కరోనాకేసులు కోటి మార్కును దాటటం తెలిసిందే. గడిచిన వారం రోజుల్లో(సరిగ్గా చెప్పాలంటే ఆరు రోజుల్లో) పది లక్షల కొత్త కేసులు నమోదుకావటం చూస్తే.. ఆ దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా మారాయన్నది ఇట్టే అర్థమవుతుంది. కరోనా తీవ్రతతో స్థానిక ప్రభుత్వాలు కొత్త నిబంధనల్ని తీసుకొస్తున్నాయి.

ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోవాలని చికాగో అధికారులు తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలు అందించే విషయంలో అమెరికాలోని పలు ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా 2.46లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేవని ఆసుపత్రి వర్గాలు చెప్పేయటంతో అక్కడి ప్రజలకు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా దేశంలో లాక్ డౌన్ విధించేందుకు ట్రంప్ ససేమిరా అంటున్నారు. అదే సమయంలో బైడెన్ కు అమెరికా అధ్యక్ష పగ్గాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. అమెరికా టైం ఏ మాత్రం బాగోలేదన్న విషయం ఇట్టే అర్థమవుతోంది.




Tags:    

Similar News