ఇవాళ ఆకాశంలో మూడు అద్భుతాలు!

Update: 2018-01-31 05:19 GMT
చంటిపిల్లాడు మొద‌లు.. ప్ర‌తిఒక్క‌రికి వెన్నెల కురిపించే చంద‌మామ అంటే ఎంతో ఇష్టం. త‌న వెలుగుల‌తో నిత్యం స‌రికొత్త అనుభూతిని ఇవ్వ‌టం చందమామ‌కే సాధ్యం. అందుకే.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అంద‌రికి చంద‌మామ ఇంట్లో మ‌నిషిగా ఫీల‌వుతుంటారు.

అలాంటి చంద‌మామ‌కు సంబంధించి ఆకాశంలో మూడు అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి. సాధార‌ణంగా ఒక‌సారి ఒక అద్భుతం మామూలే. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా ఒకే రోజులో మూడు అద్భుతాలు చోటు చేసుకోవ‌టం చాలా అరుదుగా జ‌రిగేది. అలాంటిది ఈ రోజు చోటు చేసుకోనుంది. ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూసే స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఈ రోజు చంద‌మామ అల‌రించ‌నున్నారు.

ఈ రోజు చంద్ర‌గ్ర‌హ‌ణంతో పాటు.. బ్లూ మూన్ తో పాటు సూప‌ర్ మూన్ కూడా ఆవిష్కృతం కావ‌టంతో ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా ఒకే రోజులో మూడు అద్భుతాలు 152 ఏళ్ల క్రితం చోటు చేసుకుంది. 1886లో ఆకాశంలో ఇదే త‌ర‌హాలో మూడు అద్భుతాలు చోటు చేసుకోగా.. మ‌ళ్లీ ఇప్పుడు ఆవిష్కృతం కానుంది.

చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున తెల్ల‌గా క‌నిపించే చంద్రుడు క్ర‌మేణా రంగులు మార‌తాడు.  గ్ర‌హ‌ణం రోజున చంద్రుడు ఎర్ర రంగులోకి మార‌టం మామూలే. దీన్ని బ్ల‌డ్ మూన్ అంటారు. ప్ర‌తి రెండేళ్ల ఎనిమిది నెల‌ల‌కు ఒక‌సారి చంద్రుడు బ్లూ మూన్ లోకి మారుతుంటాడు. అయితే.. ఒకే రోజులో బ్ల‌డ్ మూన్‌.. బ్లూ మూన్ తో పాటు.. సూప‌ర్ మూన్ కావ‌టంతో ఈ రోజు సో.. స్పెష‌ల్ గా మారింది. సూర్యుడు.. చంద్రుడు.. భూమి ఒకే క‌క్ష్య మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం చోటు చేసుకోవ‌టం తెలిసిందే.

గ్ర‌హ‌ణం రోజున రంగులు మారే చంద్రుడితో పాటు.. భూమికి ద‌గ్గ‌ర‌గా చంద్రుడు రావ‌టంతో మామూలుగా క‌నిపించే దానికి 14 శాతం పెద్ద‌గా.. 30 శాతం ఎక్కువ కాంతివంతంగా క‌నిపించ‌నున్నాడు. దీంతో.. మామూలు కంటే భిన్నంగా ఈసారి చంద్ర‌గ్ర‌హ‌ణం చాలా స్ప‌ష్టంగా క‌నిపించే వీలుంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజున చంద్రుడ్ని కొంద‌రు మాత్ర‌మే చూడాల‌ని.. మ‌రికొంద‌రు చూస్తే అరిష్ట‌మ‌ని కొంద‌రు జ్యోతిష్యులు చెబుతుంటే.. వారి వాద‌న‌ను మ‌రికొంద‌రు తీవ్రంగా కొట్టి పారేస్తున్నారు. ఎప్పుడో 152 ఏళ్ల‌కు ఒక‌సారి క‌నిపించే ఇలాంటి అద్భుతాన్ని ఏదో వాద‌న చూపించి మిస్ కావ‌టంలో అర్థం లేద‌ని చెబుతున్నారు. ఏమైనా.. ఆకాశంలో ఆవిష్కృత‌మ‌య్యే అద్భుతాన్ని అస్వాదిస్తూ వీక్షించాల‌న్న ఆత్రుత ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఏమైనా.. మూడు అరుదైనవి ఒకేసారి ఆవిష్కృత‌మ‌వుతున్న బ్లూబ్ల‌డ్ సూప‌ర్ మూన్ ను ఈ రోజు చూసే ఛాన్స్ ను మిస్ కావొద్దు సుమా. ఇంత‌కీ.. ఇదంతా ఎప్ప‌డు మొద‌లై ఎప్ప‌టివ‌ర‌కూ అంటే.. ఈ రోజు (బుధ‌వారం) సాయంత్రం 6.20 గంట‌ల‌కు మొద‌లై రాత్రి 7.37 గంట‌ల వ‌ర‌కూ ఉంటుంది. సో.. డోన్ట్ మిస్‌.
Tags:    

Similar News