జనాగ్రహం ఏ రేంజ్ లో ఉందో అగ్రిగోల్డ్ కు అర్థమైందా?

Update: 2016-04-12 07:08 GMT
పైసా పైసా కూడబెట్టుకొని.. భవిష్యత్ అవసరాల కోసం మదుపు చేసిన ప్రజల కలల్ని కల్లలు చేస్తూ.. వారి నెత్తి మీద కుచ్చుటోపీ పెట్టే సంస్థలు కోకొల్లలు. ఇలాంటి సంస్థలు చెప్పే మాటల్ని నమ్మి.. వారి ఆకర్షణీయమైన పథకాల పట్ల ఆకర్షితులై భారీగా మదుపు చేయటం.. టైం చూసుకొని చేతులు లెత్తేయటం పలు సంస్థలకు ఈ మధ్యన అలవాటుగా మారింది.

ఇదే రీతిలో లక్షలాది మంది మదుపుదారులకు అంతులేని ఆవేదనను నింపిన అగ్రిగోల్డ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కర్ణాటక రాష్ట్రంలోనూ అగ్గిపుట్టిస్తోంది. కర్ణాటకకు చెందిన వారు సైతం ఈ సంస్థలో పెద్ద ఎత్తున డబ్బులు దాచుకున్నారు. అగ్రిగోల్డ్ మోసం మీద తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుతో పాటు.. కర్ణాటక హైకోర్టులోనూ కేసులు నమోదయ్యాయి. వీటి విచారణలో భాగంగా కర్ణాటక హైకోర్టుకు హాజరైన అగ్రిగోల్డ్ ఛైర్మన్.. ముగ్గురు డైరక్టర్లకు జనాగ్రహం ఏ రేంజ్లో ఉందో ప్రత్యక్షంగా చూశారు.

విచారణ కోసం కోర్టుకు హాజరైన అగ్రిగోల్డ్ ఛైర్మన్.. ముగ్గురు డైరెక్టర్లను బాధితులు కోర్టు ఆవరణలో దొరకబుచ్చుకొని దొరికిన వారిని దొరికినట్లుగా పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు.  వారి మెడలో చెప్పుల దండలు వేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఊహించని ఈ పరిణామం కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ మోసాన్ని బాధితులు ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అండ్ కోలను రక్షించేందుకు.. దాడి నుంచి కాపాడేందుకు పోలీసులు.. లాయర్లు ఎంతగా ప్రయత్నించినా బాధితులు వెనక్కి తగ్గలేదు. బాధితుల నుంచి వారిని రక్షించే ప్రయత్నంలో లాయర్లు సైతం గాయాలు పాలు కావటం గమనార్హం. వేలాది కోట్ల రూపాయిల్ని ప్రజల నుంచి సేకరించి.. బోర్డు తిప్పేయటం పట్ల జనాలు ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయం అగ్రిగోల్డ్ సంస్థ ఛైర్మన్ అండ్ కోకు ఇప్పటికైనా అర్థమై ఉంటుందా?
Full View

Tags:    

Similar News