బీజేపీ గేమ్ ప్లాన్‌..మంత్రుల‌చే రాజీనామా

Update: 2018-04-18 12:35 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన క‌థువా రేప్ కేస్ విష‌యంలో బీజేపీ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. క‌థువా నిందితుల‌కు మ‌ద్ద‌తుగా ఇద్ద‌రు మంత్రులు రోడ్డెక్కిన నేప‌థ్యంలో బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే దీన్ని నిర‌సిస్తూ ఆ ఇద్ద‌రితో పాటు మ‌రో న‌లుగురు మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు గుడ్‌ బై చెప్పిన‌ట్లు జాతీయ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది నిజ‌మ‌ని తేలింది. మొత్తం ఎనిమిది మంది మంత్రులు రాజీనామా చేశారు.

కథువా ప్రకంపనలు దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాజీనామా చేయాలంటూ ఆదేశించింది. త‌ద్వారా పార్టీ ప‌రువు గంగ‌పాలు కాకుండా చూసుకుంది. దీంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వంలోని ఎనిమిది మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ కూడా రాజీనామా చేయడం గ‌మ‌నార్హం. అయితే ప్రభుత్వంతో పొత్తు మాత్రం ఉంటుందంటున్న బీజేపీ ప్రకటించింది. అంతేకాకుండా త్వరలో కశ్మీర్ లో కొత్త కేబినెట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. త‌ద్వారా బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది.

ఈ ఏడాది జనవరిలో కతువా జిల్లాలోని రసానా గ్రామానికి చెందిన ఎనిమిదేండ్ల బాలికను గుడిలో నిర్బంధించి వారం రోజులపాటు దుండగులు లైంగికదాడిచేసి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మ‌రోవైపు చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటనలతో తమకు సంబంధం లేదని, కావాలంటే తమకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కతువా కేసు నిందితులు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తిని కోరారు. ఏప్రిల్9న పోలీసులు చార్జ్‌ షీట్ దాఖలు చేసినప్పటికీ, ఇప్పటివరకు తమకు వాటి ప్రతులను అందజేయలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. చార్జ్‌ షీట్ కాపీలను వారికి కూడా ఇవ్వాలని జిల్లా సెషన్స్ జడ్జి సంజయ్‌ గుప్తా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు..
Tags:    

Similar News