ములాయం ఇంట్లో ముసలం వెనుక అమర్ సింగ్?

Update: 2016-09-16 12:36 GMT
ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో పుట్టిన ముసలం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. అయితే... తాజాగా ఈ ముసలంలో ప్రధాన పాత్ర ధారులైన కుమారుడు - యూపీ సీఎం అఖిలేశ్..  తమ్ముడు శివపాల్ యాదవ్ లను పిలిచి మాట్లాడి వ్యవహారాన్ని సెటిల్ చేశారు. కుటుంబమంతా కలిసి భోంచేసి అంతా సమసిపోయిందన్న సంకేతాలిచ్చారు. కానీ... ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చల్లో వేరే వ్యక్తి పేరు రావడంతో రాజకీయంగా సంచలనంగా మారింది. ఆయన ఎవరో కాదు... ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల నేతలతో... సినిమా వాళ్లతో - మీడియాతో మంచి సంబంధాలున్న.. ఒకప్పటి కింగ్ మేకర్ అమర్ సింగ్. అవును... కుటుంబానికి బయట వ్యక్తుల ప్రమేయం వల్లే ఇబ్బందులు వచ్చాయని అమర్ సింగును ఉద్దేశించి అఖిలేశ్ వ్యాఖ్యానించగా... అదేమీ లేదని, బయట వ్యక్తుల ప్రమేయం లేదంటూ అమర్ ను వెనకేసుకొచ్చాడు బాబాయి శివపాల్ యాదవ్. ఇదంతా చూస్తుంటే ములాయం కుటుంబంలోని ముసలం వెనుక అమర్ సింగ్ హ్యాండ్ ఉందని అర్థమవుతోంది.

నిజానికి అమర్ సింగ్ ఒకప్పుడు ఎస్సీలో కింగ్ మేకర్. ఆయన ఎంత చెబితే అంత అన్నట్లుగా నడిచింది. ములాయంకు కుడిభుజంలా ఉండేవారు అమర్. కానీ... ఆ తరువాత పలు వ్యవహారాల కారణంగా అమర్ సింగ్ - ఆయన సన్నిహితురాలు జయప్రద - మరికొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అమర్ సింగ్ రాజకీయంగా తెరమరుగయ్యారు. కానీ.. ఆరేళ్ల తరువాత ఇటీవలే ఆయన మళ్లీ సమాజ్ వాది పార్టీలో చేరారు. ఆయన్ను పార్టీ తీసుకోవడంతో పాటు రాజ్యసభకు కూడా పంపించింది. దీంతో మళ్లీ అమర్ ములాయం - ములాయం సోదరుడు శివపాల్ కు చేరవయ్యారు. కానీ.. అఖిలేశ్ కు మాత్రం అమర్ సింగ్ పట్ల సదభిప్రాయం లేదు. ఇప్పుడు తమ కుటుంబంలో చిచ్చు రేపింది కూడా అమర్ సింగేనని అఖిలేశ్ అంటున్నారు.

దీంతో ఈ ముసలంలో అమర్ సింగ్ పాత్రపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తనకు పార్టీలో జరిగిన అవమానం - బహిష్కరణకు ప్రతీకారంగానే ఆయన మళ్లీ పార్టీలోకి వచ్చి ఏకంగా ములాయం కుటుంబంలోనే ముసలం పెట్టారని అంటున్నారు. అమర్ సింగ్ పక్కా ప్లానింగ్ తో ములాయం రాజకీయ ప్రభను - ఆ కుటుంబ రాజకీయాలను అంతం చేయాలని ప్లాన్ చేస్తారని అనుమానిస్తున్నారు.
Tags:    

Similar News