‘అమిత్ కోటింగ్’ ఎఫెక్ట్ బాగానే ఉందే!

Update: 2018-02-13 07:33 GMT
చంద్రబాబునాయుడు తన పార్టీ ఎంపీలందరినీ పార్లమెంటులో మోహరించి.. వారితో నినాదాలు చేయించి.. ప్రభుత్వ వ్యతిరేకగ ఆందోళనలు చేయించి.. భాజపా తమను వంచిస్తున్నదని ప్రకటించి.. మొత్తానికి ఒక విషయాన్ని మాత్రం సంపూర్ణంగా సాధించారు. ఆగండి.. అప్పుడే మురిసిపోకండి.. ఆయనేమీ పోలవరం పూర్ణ నిధులో - రైల్వేజోనో సాధించేయలేదు. సాధించినది కాస్తా ఆయన వ్యక్తిగత లబ్ధికి ఉపయోగపడేదే తప్ప.. రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు. ఇంతకూ ఆయన ఏం సాధించారా? అనుకుంటున్నారు కదా.. అదే.. సోము వీర్రాజు ధాటికి కాస్త బ్రేకులు వేయడం. ఇటీవలి విమర్శల తర్వాత పార్లమెంటులో  రాష్ట్రం గురించి.. బహిరంగ పోరాటంతో పాటు, సోము వీర్రాజు తమ పరువు తీస్తున్న వైనం గురించి.. తెదేపా ఎంపీలు అమిత్ షాకు తెర వెనుకన ఫిర్యాదు చేశారని సమాచారం. దాని ప్రభావం అప్పటికప్పుడు బాగానే కనిపించింది. అమిత్ షా సోము వీర్రాజుకు ఫోన్ చేసి.. తీవ్రంగా మందలించినట్లు సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వంపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలూ ఉండకూడదని - సిద్ధాంతాల గురించి మాత్రమే ఉండాలని హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. అలాగే రెండు పార్టీల సంబంధాలు గురించి మాట్లాడడానికి మీకేం అధికారం ఉన్నదని కూడా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు విజయం సాధించి - అమిత్ షా ద్వారా వేయించిన అక్షింతలు బాగానే పనిచేశాయి.

ఎలా నిరూపణ అవుతున్నదంటే.. సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. విభజన హామీల విషయంలో తెలుగుదేశం పార్టీ ఆరోపణల్ని ఆయన భాజపా తరఫున ఖండించారు. ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఎక్కడెక్కడ ఎలా వెచ్చించారో రాష్ట్ర  ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 2017లో మెచ్చుకున్న కేంద్రప్రభుత్వాన్నే ఇప్పుడు మాత్రం ఇష్టమొచ్చినట్టు తిట్టిపోస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కీలకం ఏంటంటే.. ఎక్కడా ఆయన చంద్రబాబు మీద - అవినీతి మీద - రాష్ట్రప్రభుత్వ వైఫల్యాల మీద ప్రసంగించలేదు. ఏదో తన పరిధి ఎంత వరకో - అంత వరకు మాత్రమే.. భాజపాను డిఫెండ్ చేసే సంక్షిప్త ప్రసంగం చేసి ముగించారు. కాకపోతే.. అచ్చంగా ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి వస్తే మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లే అని చెప్పకతప్పదు.
Tags:    

Similar News