సాగ‌ర్ ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌..తెలుగు రాష్ట్రాల నీళ్ల లొల్లి

Update: 2018-02-28 11:16 GMT
ఏపీ రెండు ముక్క‌లు కావ‌టం పెద్ద విష‌యం కాదు. కానీ.. విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలు అంత‌కంత‌కూ పెరుగుతాయి. నీళ్ల కోసం తెలుగోళ్ల మ‌ధ్య గొడ‌వ‌లు గ్యారెంటీ అంటూ సాగిన అంచ‌నాల్లో నిజ‌మ‌న్న‌ది ఎంత‌న్న‌ది ఇటీవ‌ల కాలంలో చూస్తున్న ఉదంతాలు చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు.

ఇప్ప‌టికే కృష్ణా జ‌లాల మీద రెండు రాష్ట్రాల మధ్యనున్న పేచీ కేంద్ర స్థాయిలో చికాకు పెడుతోంది. ఆ మ‌ధ్య‌న రెండు..మూడు సార్లు సాగ‌ర్ నీళ్ల‌ను విడుద‌ల చేయ‌టంలో ఏపీ.. తెలంగాణ‌ల మధ్య ఉద్రిక్త‌త రెండు రాష్ట్రాల్ని క‌ల‌వ‌ర పెట్టింది. తాజాగా మ‌రోమారు ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది.

సాగ‌ర్ కుడి కాల్వ‌కు నీటి విడుద‌ల‌ను తెలంగాణ అధికారులు నిలిపివేయ‌టం.. దానికి అభ్యంత‌రం చెబుతూ ఏపీ అధికారులు వాగ్వాదానికి దిగ‌టంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారింది.  రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం ప్ర‌కారం ఏపీకి 10.5 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది. ఇప్ప‌టివ‌ర‌కూ 10.2 టీఎంసీల నీటిని కుడి కాల్వ ద్వారా విడుద‌ల చేశారు.

మ‌రో 0.3టీఎంసీల నీటి కోసం ఏపీ కోరుతోంది. ఇందుకునీటిని విడుద‌ల చేయ‌కుండా తెలంగాణ అధికారులు అడ్డుకుంటున్నార‌న్న‌ది ఏపీ అధికారుల వాద‌న‌. ఇదిలా ఉంటే.. బోర్డు కేటాయించిన దాని కంటే ఎక్కువ నీటిని ఏపీ వాడుకుంద‌న్న‌ది.. దానికి నీటిని వెంట‌నే నిలిపివేయాల‌న్న‌ది తెలంగాణ అధికారుల వాద‌న‌గా ఉంది.

ఈ వివాదం అంత‌కంత‌కూ పెరిగి రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితికి దారి తీస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం నాగార్జున‌సాగ‌ర్ డ్యామ్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా డ్యామ్ వ‌ద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్య‌లో మొహ‌రించారు. ప్ర‌స్తుతం ఇరు రాష్ట్రాల అధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మ‌రి.. ఈ వివాదం ఏ రూపుకు వెళుతుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది.
Tags:    

Similar News