పవన్ ఇచ్చిన అతి పెద్ద హామీ..... రియాక్షన్ ఏంటి...?

Update: 2022-11-09 00:30 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను బాగా స్టాడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గల మార్గాలను ఆయన అన్వేషిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసినా లేక జంటగా పొత్తులతో బరిలోకి దిగినా కూడా జనాలు తమ వైపు ఉండేలా పవన్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే ఆయన జనసేన ఆవిర్భావ సభలో కొన్ని కీలక అంశాల మీద హామీలు ఇచ్చారు. వాటిలో అతి ముఖ్యమైనది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినది. అది వారి జీవితాలకు అవసరమైనది.

అదే కంట్రిబ్యూటరీ  పెన్షన్ స్కీం రద్దు. ఈ విషయంలో జగన్ ఒక్కరే గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖజానా పరిస్థితి. పైగా ఇది అత్యంత ఆర్ధికంగా దుర్భరమైనది. ఈ విషయం తాము స్టడీ చేయలేకపోవడం వల్లనే హామీ ఇచ్చేశామని వైసీపీ ఆ తరువాత నాలుక కరచుకుంది. కానీ ఉద్యోగులు మాత్రం దాన్ని నమ్మి జగన్ కి గుత్తమొత్తంగా ఓట్లు కట్టబెట్టారు.

అయితే మూడున్నరేళ్లు కాలం సాగింది కానీ జగన్ సర్కార్ మాత్రం సీపీఎస్ రద్దు విషయంలో ఏ ఒక్క మాటా మాట్లాడడంలేదు. దానికి ఆల్టర్నేషన్ మాత్రమే ఆలోచిస్తోంది. దానికి ససేమిరా అంటున్న ఉద్యోగులు సీపీఎస్ రద్దుకే పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ఇస్తున్న టీడీపీ కానీ చంద్రబాబు కానీ తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని గట్టిగా చెప్పడంలేదు. అసలు ఆ హామీ ఊసే వారు ఎత్తడంలేదు. దానికి కారణం చంద్రబాబుకు కూడా తెలుసు. అది తాము అమలు చేయలేమని.

అందుకే ఆయన ఈ విషయం మాత్రం ప్రస్థావించడంలేదు. నిజానికి 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన ఉద్యోగులు సీపీఎస్ రద్దు మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ విషయం తేల్చకుండా ముంచకుండా టక్కర్ కమిషన్ అని ఒకటి వేసి చేతులు దులుపుకున్నారు. దాంతో బాబు మీద మండిన ఉద్యోగులు జగన్ సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారని ఆ వైపునకు మొగ్గారు. ఇపుడు చూస్తే జగన్ సైతం అదే దోవన నడిచారు. దాంతో ఏపీలో మూడవ పక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయం ఎత్తుకున్నారు.

ఆయన ఆవిర్భావ సభలో ఇచ్చిన కీలక హామీ ఇది. తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని ఆయన చాలా బోల్డ్ గా క్లియర్ గా చెప్పేశారు. కానీ ఈ విషయం మీద జనసైనికులు అయితే సీరియస్ గా జనంలోకి తీసుకెళ్ళడంలేదు. మరో వైపు చూస్తే తమకు ఇంతటి భారీ హామీ ఇచ్చిన జనసేనను ఈ రోజుకీ ఉద్యోగ సంఘాల నాయకులు అభినందించినది లేదు. అదే ఏ చంద్రబాబో ఇదే హామీ ఇస్తే మాత్రం ఆయన వెన్నంటి ఉద్యోగులు ఉంటారు. మరి పవన్ ఇంత స్పష్టంగా ఈ హామీ ఇచ్చినా వారు ఉలుకూ పలుకూ  లేకుండా ఉన్నారంటే కారణం ఏంటో తెలియడంలేదు.

ఇక ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఉంటే తప్పకుండా ఏ పార్టీ అయినా విజయం సాధిస్తుంది. అలా చూసుకుంటే సీపీఎస్ రద్దు వల్ల బెనిఫిట్ పొందేవారు నాలుగు లక్షల మంది. అలాగే మరో మూడు లక్షల వరకూ రిటైర్డ్ అయిన వారు ఇక వారి కుటుంబాలను తీసుకుంటే ఏకంగా ఇరవై లక్షల మంది దాకా ఓట్లు జనసేనకు పడే అవకాశం ఉంది. కానీ పవన్ కూడా ఆ తరువాత ఇదే విషయాన్ని మరచిపోయారో లేక ఎందుకు ఎత్తడంలేదో ఎవరికీ అర్ధం కావడంలేదు.

ఇక జనసైనికులు కూడా ఎంతసేపూ తమను తాము డిఫెండ్ చేసుకుంటూ మీడియా మీటింగ్స్ నిర్వహించడంతఒనే సరిపెడుతున్నారు. అంతే తప్ప తమ పార్టీ అధికారంలోకి వస్తే తాము సీపీఎస్ రద్దు చేస్తామని జనంలో ప్రచారంలో పెడితే కచ్చితంగా వారికి లాభం చేకూర్చే అంశం అవుతుంది. కానీ వారు కూడా పట్టించుకోవడంలేదు. మొత్తానికి చూస్తే పవన్ ఇచ్చిన అతి పెద్ద విలువైన హామీ ఇలా ఎవరికీ చెందకుండా పొందకుండా పోతోందా అన్నదే చర్చగా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News