సింగిల్ ఫైట్ అంటే ఓటమికి హగ్ చేసుకున్నట్లే....ఏపీలో పొలిటికల్ వార్

Update: 2022-12-12 01:30 GMT
ఏపీలో పొలిటికల్ వార్ ఒక స్థాయిలో సాగుతోంది. వివిధ రాజకీయ పార్టీల మీద జనాభిప్రాయం ఎలా ఉంది అంటే మిశ్రమంగా అని చెప్పాలి. అధికారంలో ఉన్న వైసీపీ మీద వ్యతిరేకత ఉంది. అది ప్రభుత్వాన్ని దించే స్థాయిలో ఉందా ఉంటే ఏ పార్టీని వెంటనే చాన్స్ ఇచ్చి కూర్చోబెడతారు అంటే క్లారిటీ లేదు. ఎందుకంటే వైసీపీ తరువాత స్ట్రాంగ్ పార్టీగా ఉన్న టీడీపీ ఎన్నో ఏళ్ళు పాలించింది. దాంతో ఫ్రెష్ లుక్ అయితే ఆ పార్టీ విషయంలో లేదు.

పోనీ జనసేనకు చాన్స్ ఇస్తారా అంటే ఆ పార్టీ విధి విధానాలు ఇంకా జనంలోకి గట్టిగా చేరలేదు. పైగా ఆ పార్టీ సంస్థాగతంగా బలపడాల్సి ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ కి వ్యతిరేకంగా మరో పార్టీ మీద పూర్తి  స్థాయి మక్కువ అయితే కలగడంలేదు అంటున్నారు. ఈ పరిస్థితులను చూసినపుడు ఒంటరి పోరుకి సిద్ధమైతే మాత్రం మ్యాజిక్ ఫిగర్ కి ఏ పార్టీ కూడా చేరుకోలేదు అని అంటున్నారు.

అది చివరికి ఫస్ట్ టైం ఏపీలో హంగ్ అసెంబ్లీకి కూడా దారి తీయవచ్చు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూస్తాను అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా ప్రయత్నాలు ఎంతవరకూ చేశారో కానీ ప్రధాని మోడీని కలసిన తరువాత ఆయన ఆ విషయంలో ఫుల్ సైలెంట్ అయ్యారు. పైగా ఆ మధ్య విజయనగరం టూర్ కి వెళ్ళినపుడు తనను ప్రజలు గెలిపించాలంటూ సింగిల్ పోరుకే మొగ్గు చూపుతున్నట్లుగా చెప్పేశారు. ఆ మాటను పదే పదే జనసేన వర్గాలు కూడా అంటున్నాయి,.

ఇంకో వైపు టీడీపీ కూడా ఒంటరి పోరు అని బయటకు చెప్పకపోయినా ఆ పార్టీ నేతలు తమకే 160 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు. ఏపీలో మొత్తానికి మొత్తం టీడీపీ ఊడ్చేస్తుంది అని కూడా ధీమా పడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ సీన్ అలా లేదు అంటున్నారు. ముఖ్యంగా టీడీపీలో అట్టడుగు స్థాయిలో చూస్తే వర్గ పోరు ఎక్కువగా ఉంది. అలాగే నేతల మధ్య మనస్పర్ధలు చాలా ఉన్నాయి. దాంతో ఒంటరిగా రెడీ అయితే మాత్రం సైకిల్ పార్టీకి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

ఇక సింహం సింగిల్ గా వస్తుంది అంటూ అదిరిపోయే పోలికలు తెచ్చి  వైసీపీ హంగామా చేయవచ్చు కానీ ఆ పార్టీకి నల్లేరు మీద నడక కాదని అంటున్నారు. వైసీపీ బయటకు ఒంటరి పోరు అని చెబుతున్నా తెలంగాణాలో అధికారంలో ఉన్న బీయారెస్ తో ఏపీలో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని బరిలోకి దిగే చాన్స్ ఉండొచ్చు అన్న డౌట్లు వ్యక్తం చేసేవారు ఉన్నారు. అలాగే కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా నెట్టుకువస్తున్నది కూడా బీజేపీతో పరోక్ష సాయం కోసమే అంటున్నారు. ఇవి బయటకు కనబడని పొత్తులు అని అంటున్నారు. ఈ విధంగా మూడు పార్టీలు ఒంటరి పోరు అని బయటకు చెబుతున్నా చివరికి వారు ఏదో విధంగా పొత్తులకే వస్తారు అని అంటున్నారు

అలా కనుక జరగకపోతే మాత్రం  రిజల్ట్ తారు మారు అవుతుందని, అధికారంలోకి రావడానికి తగిన సంఖ్యా బలం దక్కదని అంటున్నారు. సో సింగిల్ ఫైట్ అంటే ఓటమిని కోరి కౌగిలించుకున్నట్లే అని తేల్చేస్తున్నారు. మరి ఈ సంగతి తలపండిన ఆయా పార్టీల రాజకీయ నేతలకు తేలియకుండా ఉంటుందో.సో ఏపీలో వచ్చే ఎన్నికలు పొత్తులతోనే సాగుతాయి. ఆ విధంగానే ప్రత్యర్ధులపైన కత్తులు దూస్తారని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News