అమెరికాలోని తెలుగోళ్ల‌లో భ‌యం!

Update: 2017-02-24 09:23 GMT
నిజ‌మే... అనుకున్నంతా అయ్యింది. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌... దూకుడు స్వ‌భావాన్ని అంచ‌నా వేసి... అక్క‌డి విదేశీయుల‌తో పాటు స్వ‌దేశీయులు కూడా తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఎన్న‌డూ రోడ్డెక్క‌ని మ‌హిళ‌లు కూడా ట్రంప్ విధానాల‌తో బెంబేలెత్తిపోయి నిర‌స‌న‌ల‌కు దిగారు. రోజుల త‌ర‌బ‌డి కొన‌సాగిన ఈ నిర‌స‌న‌ల‌ను ట్రంప్ త‌న‌దైన క‌ర‌కు స్వ‌భావంతోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. అమెరికా వ‌ల‌స విధానాల్లో స‌మూల మార్పులు తెస్తామ‌ని, స్వ‌దేశీయుల త‌ర్వాతే విదేశీయుల‌కు ప్రాధాన్య‌మిస్తామ‌ని ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు, చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేస్తాన‌ని చేసిన ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు అమెరికా వాణిజ్య వ‌ర్గాల‌ను కూడా హ‌డ‌లెత్తించాయి. ట్రంప్ వ్య‌వ‌హార స‌ర‌ళిని అనుస‌రించిన అమెరికాకు చెందిన కొంద‌రు ఉద్యోగులు, వ్య‌క్తులు... త‌మ‌లోని జాత్యంహంకార ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలో అప్ప‌టిదాకా మెరుగైన నైపుణ్యం ఉన్న విదేశీయుల‌కు అక్క‌డ ల‌భించిన గౌర‌వం క్ర‌మంగా త‌గ్గిపోయింది. వేనోళ్ల కీర్త‌న‌లు అందుకున్న చోటే చీత్కారాలు ఎదురు కావ‌డం ప్రారంభ‌మైంది.

ఇక జీవితంలో అంత‌గా స్థిర‌ప‌డ‌ని, ఆక‌తాయి అమెరికన్లు  అక్క‌డి విదేశీయుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ‌టం ప్రారంభించారు. ఈ కోవ‌లోనే తెలుగు నేల‌కు చెందిన ఇద్ద‌రు యువ‌కుల‌పై అక్క‌డ వారం వ్య‌వ‌ధిలో దాడులు జ‌రిగిపోయాయి. ఈ దాడుల్లో తెలుగు నేల‌కు చెందిన ఇద్ద‌రు యువకులు ప్రాణాలు కోల్పోగా... మ‌రో యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. కేవ‌లం వారం  వ్య‌వ‌ధిలో చోటుచేసుకున్న ఈ రెండు ఘ‌ట‌న‌లు అక్క‌డి విదేశీయుల‌ను ప్ర‌త్యేకించి తెలుగు వారు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. వారం క్రితం అమెరికాలో చోటుచేసుకున్న జాత్యంహ‌కార దాడిలో తెలంగాణ‌లోని వ‌రంగల్ జిల్లాకు చెందిన ఓ యువ‌కుడు దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. తాజాగా బుధ‌వారం రాత్రి అమెరికాలోని క‌న్సాస్ రాష్ట్రంలోని ఒలాతేకు చెందిన ఓ బార్‌లో ఈ త‌ర‌హా ఘ‌ట‌నే చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఏపీకి చెందిన కూచిభొట్ట శ్రీనివాస్ అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోగా... మాద‌సాని అలోక్ అనే యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు కార‌కులైన అమెరిక‌న్లు... త‌మ దేశం వ‌దిలిపోవాల‌ని తెలుగోళ్ల‌ను  బెదిరించిన విష‌యాన్ని మ‌రిచిపోరాదు. అయినా ఏ విష‌యంలో మీరు మా కంటే ఎక్కువ అంటూ ఆ జాత్యంహ‌కారులు చేసిన వ్యాఖ్య‌లు తెలుగోళ్ల‌నే కాదు... అమెరికాలో ఉంటున్న అన్ని దేశాల పౌరుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసేవే. బుధ‌వారం రాత్రి నాటి తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌నే కాకుండా భార‌త ప్ర‌భుత్వాన్ని కూడా తీవ్రంగా ఆందోళ‌న‌కు గురి చేసింద‌నే చెప్పాలి. ట్రంప్ దూకుడు వైఖ‌రి కార‌ణంగా పెచ్చ‌రిల్లుతున్న ఈ త‌ర‌హా జాత్యంహ‌రాక దాడుల‌కు క‌ళ్లెం వేసేందుకు ప్ర‌పంచ దేశాలు త్వ‌రిత గ‌తిన మేల్కోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న‌ది తెలుగోళ్ల అభిప్రాయం.

ఇదే వాద‌న‌ను వినిపించిన అలోక్ తండ్రి... అమెరికాలోని తెలుగు వారు జాగ్ర‌త్త‌గా మ‌స‌లుకోవాల‌ని కోరారు. అంతేకాకుండా... ఆయ‌న వ్య‌క్తం చేసిన ఆందోళ‌న‌తో భార‌త విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన మ‌రుక్ష‌ణ‌మే అమెరికాలోని భార‌త రాయ‌బారికి ఫోన్ చేసి మ‌రీ వివ‌రాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా... అక్క‌డ నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితులు, మారిన వాతావ‌ర‌ణంపైనా ఆమె స‌మ‌గ్ర వివ‌రాలు సేక‌రించే ప‌నిని ప్రారంభించారు. అంటే... ప‌రిస్థితి చేజార‌క‌ముందే భార‌త ప్ర‌భుత్వం మేల్కొంద‌న్న‌మాట‌. మిగిలిన దేశాలు కూడా ఒక్క‌తాటిపైకి వ‌స్తే త‌ప్పించి... ట్రంప్ స‌ర్కారు త‌న దూకుడు వైఖ‌రిని త‌గ్గించ‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News