ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో తేడా చెప్పిన యువ ఎంపీ

Update: 2017-05-10 05:32 GMT
విద్యార్థి నాయ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో జోరుగా పాల్గొన‌ట‌మేకాదు.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించారు టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ బాల్క సుమ‌న్‌. మంట పుట్టే మాట‌ల్ని చెప్పే సుమ‌న్ లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా.. చంద్ర‌బాబుతో భేటీ అయిన సంద‌ర్బంగా ఆయ‌న ప‌క్క‌నే సుమ‌న్ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న పాల‌న‌లోని తేడాలు.. ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఉన్న వ్య‌త్యాసాల గురించి ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. బాల్క సుమ‌న్ చెప్పిన ఆస‌క్తిక‌ర అంశాలు కొన్నింటిని చూస్తే..

= ద‌శాబ్దాలుగా ప‌రిష్కారం కాని అంశాల్ని గ‌డిచిన మూడేళ్ల టీఆర్ ఎస్ పాల‌న‌లో ఒక కొలిక్కి తీసుకొచ్చాం. ఎంపీగా నియోజ‌క‌వ‌ర్గానికి చేసిన ప‌నులు సంతృప్తిక‌రంగా అనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మం సాఫ‌ల్య‌మైన‌ట్లే. నీళ్లూ.. నిధులు.. నియామ‌కాలే తెలంగాణ ఉద్య‌మానికి మూలం. ఈ మూడింటిలోనూ మూడేళ్ల‌లో చాలానే కృషి చేశాం. వాటి ఫ‌లాలు తెలంగాణ ప్ర‌జ‌ల అనుభ‌వంలోకి వ‌చ్చేశాయి కూడా. ఉమ్మ‌డి రాష్ట్రంలో నాటి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి క‌ట్టె ప‌ట్టుకొని మ‌రీ.. మీకు క‌రెంటు రాదు.. నీళ్లురావు.. ప‌రిశ్ర‌మ‌లు వెళ్లిపోతాయ‌ని అన్నారు. కానీ.. ఇప్పుడు క‌రెంటు అద్భుతంగా వ‌స్తోంది. ఆంధ్రా బంధ‌నాల నుంచి విముక్తి అంటూనే.. ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల‌కే ప్రాజెక్టులు ఇస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ.. ముంబ‌యి.. కోల్ క‌తా ఇలా దేశంలోని అన్ని ప్రాంతాల కాంట్రాక్ట‌ర్లంతా తెలంగాణ‌కు వ‌చ్చి ప‌ని చేస్తున్నారు. ఆంధ్రా పాల‌కుల మీద‌నే మాకు కోపం.. ఆంద్రా వ్య‌క్తుల మీద కాదు.

= టీడీపీ లెజిస్లేచ‌ర్ పార్టీ ఒక నిర్ణ‌యం తీసుకొని టీఆర్ ఎస్ లో విలీన‌మైందే త‌ప్ప‌.. ఫిరాయింపులు ఎంత‌మాత్రం కావు. ప‌శువుల్ని కొన్న‌ట్లుగా కొన్నార‌న్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న ఆ రాష్ట్రంలో చేస్తున్న‌దేమిటి? జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి తీసుకొని మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఆయ‌న‌కు ఆ మాట అనే హ‌క్కు లేదు.

= చంద్ర‌బాబు.. కేసీఆర్ పాల‌న‌కు అస్స‌లు పోలికే లేదు. న‌క్క‌కు.. నాగ‌లోకానికీ ఉన్నంత తేడా ఉంది. రాష్ట్రమంతా మంచినీళ్లు ఇచ్చే పెద్ద కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టాం. ఏపీలో అలాంటిది లేదు. ఏపీలో చెత్త‌పాల‌న అంటూ జ‌పాన్ కంపెనీ చేసిన ఆరోప‌ణ‌ల జోలికి నేను వెళ్ల‌టం లేదు. కానీ.. సంక్షేమ‌.. అభివృద్ధి రంగంలో కేసీఆర్ కు ఉన్న విజ‌న్‌.. తెలంగాణ‌ను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీసుకెళుతోంది. కేసీఆర్ కంటే బాబు సీనియ‌ర్ అన్న‌ది అన‌వ‌స‌రం. సీనియార్టీతో ఏముంది? సిన్సియార్టీ ముఖ్యం. మా నేత‌కు తెలంగాణ‌ను గొప్ప రాష్ట్రంగా చేయాల‌న్న సిన్సియార్టీ ఉంది. ఏపీలో అలా లేద‌నే దానికి జ‌పాన్ కంపెనీ విమ‌ర్శ‌లు.. ఇసుక దందాలే నిద‌ర్శ‌నం. క‌మిట్ మెంట్ ఉంటే అలాంటివి ఉంటాయా? ఏపీలో అధికార‌పార్టీ నాయ‌కుల్ని ప్ర‌జ‌లు తిడుతున్నారు. బాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రాజ‌ధాని నిర్మాణం ఎందుకు చేప‌ట్ట‌లేదో అర్థం కాదు. రాజ‌దాని పేరుతో బోలెడు ఖ‌ర్చు చేశారు. అప్పుడే ప‌నులు స్టార్ట్ చేసి ఉంటే.. ఇప్ప‌టికి నిర్మాణాలు ఒక రూపున‌కు వ‌చ్చేవి. కేసీఆర్ ఎవ‌రికీ భ‌య‌ప‌డే ర‌కం కాదు. జ‌గమొండి. ఆయ‌న్ని భ‌య‌పెట్టే శ‌క్తి ఎవ‌రికీ లేద‌నేదే నా అభిప్రాయం. బ్ర‌హ్మ‌దేవుడు కూడా చంద్ర‌బాబును ర‌క్షించ‌లేడ‌ని కేసీఆర్ అన్న వ్యాఖ్య‌ల‌పై.. నిజ‌మే.. త‌ప్పుచేసిన వారిని ఎవ‌రూ ర‌క్షించ‌లేరు. ఓట్ల‌కు నోట్ల కేసులో బాబు త‌ప్పు చేశారా? లేదా? అన్న‌ది కోర్టు తేల్చ‌నుంది. బాబు త‌ప్పు కానీ త‌ప్పు చేస్తే బ్ర‌హ్మ‌దేవుడుకూడా ర‌క్షించ‌లేడు.. ఆ మాట‌ల్లో త‌ప్పేముంది?


Tags:    

Similar News