అమ‌ర‌వీరుల వ‌ద్ద రేవంత్ పోతురాజు విన్యాసం

Update: 2018-01-12 17:03 GMT
రాష్ట్ర విద్యుత్‌ రంగానికి సంబంధించి కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి  మరోమారు ఎలాంటి ఆధారాలు లేకుండా అమరవీరుల సాక్షిగా పచ్చి అబద్దాల పురాణం విప్పి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాడ‌ని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ మండిపడ్డారు. అమరవీరుల స్థూపం వద్ద కూర్చొని పోతురాజు విన్యాసాలతో డ్రామాలు చేసి అమరవీరుల త్యాగాలనే అవమానించాడన్నారు.  టీఆర్‌ ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయ‌న విలేక‌రుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌ పై విరుచుకుప‌డ్డారు. `రేవంత్‌ రెడ్డి  ఒక అబద్దాల కోరు. పట్టపగలే డబ్బులతో పట్టుబడిన గజదొంగ. సీఎం - మంత్రులను - ఇతర ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ తిరిగే బుట్టాచోర్‌` అని దుయ్యబట్టారు.

`పాడిందే పాట పాచి పళ్ల దాసు అన్న చందంగా మేం డ్యాక్యుమెంట్లతో సహా సమాధానం చెప్పినా పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నాడు. 53.8శాతం విద్యుత్‌ కేటాయింపు కాంగ్రెస్‌ గొప్పదనం కాదు. 2008లో ఈ నిర్ణయం జరిగింది. దానినే విభజన చట్టంలో పెట్టారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగినవి రెండు ఒప్పందాలు. ఒకటి చత్తీస్‌ఘడ్‌ ఒప్పందం. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఈ ఒప్పందం చేసుకున్నందుకు ఆ ప్రభుత్వం మాకు ఎన్ని డబ్బులు ఇచ్చిందో బీజేపీని చెప్పమనండి. ఇక రెండోది థర్మల్‌ టెక్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం. ఈ సంస్థ యజమాని అయిన కాంగ్రెస్‌ ఎంపీ టీ. సుబ్బిరామిరెడ్డి మాకు ఎన్ని డబ్బులు ఇచ్చిండో గాంధీభవన్‌ లో ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పమనండి` అంటూ సుమ‌న్ స‌వాల్ విసిరారు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ ఈఎల్‌ కు ప్రాజెక్టు బాధ్యతలు ఇస్తే కూడా విమర్శలు చేస్తున్న రేవంత్‌ లాంటి సన్యాసిని ఈ భూమిమీద ఎక్కడా చూడలేదని మండిప‌డ్డారు. `దేశ వ్యాప్తంగా రెండు లక్షల 40వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంటే రెండు లక్షల 15వేల మెగావాట్ల విద్యుత్‌ సబ్‌ క్రిటికల్‌ లో జరుగుతోంది. దేశంలో నిర్మాణం జరుగుతున్న 28 ప్రాజెక్టులు సబ్‌ క్రిటికల్‌ ప్రాజెక్టులే. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు బీహెచ్‌ ఈఎల్‌ కు ఇచ్చే నాటికి సూపర్‌ క్రిటికల్‌ రాలేదు. ఒక్కటే 800మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఒక్కటే ప్రాజెక్టు ఎందుకు కట్టడంలేదని కాంగ్రెస్‌ నాయకులడుగుతున్నారు. 800 మెగావాట్ల ప్రాజెక్టు ట్రిప్‌ అయితే జరిగే నష్టం ఎక్కువ. అందుకే 270 మెగావాట్ల సామర్ధ్యంతో 4 ప్రాజెక్టులు కడుతున్నారు. ఇందులో ఒకటి ట్రిప్‌ అయినా మిగిలిన మూడు ప్రాజెక్టుల ద్వారా విద్యుత ఉత్పత్తి జరుగుతుంది.` అని వివ‌రించారు.

వ్యక్తిగతంగా తన అనుయాయులతో నన్ను తిడుతూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టించాడ‌ని సుమ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.  `ఉద్యమకారుడిగా నా విశ్వసనీయత ఏమిటో, నీవిశ్వసనీయత ఏమిటో ప్రజలకు తెలుసు. ఉద్యమం సందర్భంగా  పోలీసులు నాపై కేసుల మీద కేసుల పెడుతూ చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో పెట్టి హింసిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎన్నడైనా జైతెలంగాణ అన్నవా? కరీంనగర్‌లో ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన నీచుడివి. ఇకనైనా వాస్తవంలో బతుకు సీఎం, మంత్రులను పదేపదే తిడుతూ చిల్లర పబ్లిసిటీ కోసం తాపత్రయపడుతున్నవు. నీ చెంచాగాళ్లతో నన్ను తిట్టిస్తూ వీడియోలు పెడుతున్నవు.  హిందీలో బాల్క అంటే వెంట్రుక అని నీ తొత్తులతో చెప్పించి అవమానిస్తున్నవు. బాల్క అంటే పర్షియన్‌ భాషలో పర్వత శిఖరమని అర్ధం. నేను పర్వత శిఖరం లాంటోడిని. రేవంత్‌ నువ్వు రవ్వంత.  ఉద్యమం సందర్భంగా నీలాంటి తెలంగాణ ద్రోహులంతా ఒక్కటై నన్ను రోజు కుక్కను కొట్టినట్లు కొట్టించినా నేను వెన్ను చూపలేదు.  పారిపోయానంటవా?. నువ్వే పారిపోయేలా చేస్తా. నువ్వొక పొలిటికల్‌ బఫూన్‌ వి - బ్రోకర్‌ వి. నేను తలుచుకుంటే వంద రెట్లు ఎక్కువ తిడుతూ వీడియోలు పెట్టగలను. నోరు తెరిస్తే అబద్దాలు. 24గంటల కరెంట్‌ షాక్‌ కు గిలగిల కొట్టుకుంటున్నవా?. కాంగ్రెస్‌ వల్లే 24గంటల విద్యుత్‌ అని అబద్దాలాడతవా?. అదే నిజమైతే మీ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక - పంజాబు రాష్ట్రాలలో ఎందుకు 24గంటల కరంటు సరఫరా చేయడంలేదు?. దీనిని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు. నాలుగైదు పార్టీలు మార్చి చీకటి దందాలతో బతికే బుట్టాచోర్‌ వి నువ్వు. ఖబడ్దార్‌ నీ తీరు మారకపోతే రాష్ట్రంలో తిరగలేవు` అని బాల్క సుమన్‌ నిప్పులు చెరిగారు.
Tags:    

Similar News