అసద్ ఇగోను అలా టచ్ చేస్తే ఎలా భట్టి సాబ్?

Update: 2019-12-24 07:45 GMT
ఎవరెన్ని చెప్పినా.. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పవర్ చెలాయించినా అదంతా హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మినహాయించి మాత్రమేనన్నది మర్చిపోకూడదు. రాష్ట్రం మొత్తం స్వీప్ చేసినా.. పాతబస్తీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ తప్పించి మరే రాజకీయ పార్టీ జెండా ఎగిరే పరిస్థితి లేదన్నది మర్చిపోకూడదు.

పాతబస్తీలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే మజ్లిస్ అధినేత అసద్ ను ఉద్దేశించి చేసే వ్యాఖ్యల విషయంలో కాస్తంత జాగ్రత్త అవసరం. కానీ.. అందుకు భిన్నంగా అసద్ ఇగోను టచ్ చేసేలా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. పాతబస్తీలోని దారుస్సలాంలో తలుపులు వేసుకొని మీటింగులు పెట్టుకోవటం కాదని.. బయటకు వచ్చి బీజేపీ విధానాల్ని వ్యతిరేకించాలంటూ సవాల్ విసిరారు.

పౌరసత్వ సవరణ చట్టం.. ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఈ నెల 28న తాము నిర్వహించే నిరసన ర్యాలీకి మద్దతు ఇస్తారా? ర్యాలీలో పాల్గొంటారా? అని ప్రశ్నించారు. ఇన్ని ప్రశ్నలు వేసిన భట్టికి మజ్లిస్ అధినేత సింఫుల్ గా అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? అన్నది క్వశ్చన్. తలుపులు వేసుకొని దారుస్సలాంలో మీటింగ్ పెట్టామంటున్న భట్టి.. అదే ప్రాంతంలో కాంగ్రెస్ సభను నిర్వహించగలదా? అని సవాల్ విసిరితే పరిస్థితి ఏమిటన్నది మర్చిపోకూడదంటున్నారు. తమకు బలం లేని అంశం మీద నోరు పారేసుకుంటే.. అదొచ్చి చుట్టుకుంటుందన్న చిన్న విషయాన్ని భట్టి సాబ్ ఎందుకు మిస్ అవుతున్నట్లు? రాజకీయంగా మాట విసరొచ్చు కానీ.. ఇగోను టచ్ చేయకూడదన్న విషయాన్ని సీఎల్పీ నేత ఎందుకు మిస్ అవుతున్నట్లు చెప్మా?
Tags:    

Similar News