తిరుపతి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. ఎవరంటే?

Update: 2020-11-16 17:30 GMT
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఇక్కడ పోటీకి సై అనగా.. అధికార వైసీపీ కూడా దూకుడుగా ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా చంద్రబాబు తెరపైకి వచ్చారు. టీడీపీ తరుఫున తిరుపతి లోక్ సభ స్థానానికి పోటీచేసి గతంలో ఓడిపోయిన కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మీని తాజాగా టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఆమె టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. వెంటనే పావులు కదిపి తిరుపతి బరిలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ప్రకటించారు. లోక్ సభ నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి ఈ ప్రకటన చేశారు.

వైసీపీ సిట్టింగ్ ఎంపీ దుర్గా ప్రసాద్ మరణంతో ఖాళీ అయిన ఈ తిరుపతి ఎంపీ సీటుకు జనవరి తర్వాత ఉప ఎన్నిక జరగవచ్చు. ఈ క్రమంలోనే ఎస్సీ రిజర్వుడు అయిన ఈ సీటుపై అందరికంటే ముందే సర్దుకొని చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించడం విశేషంగా మారింది.

సాధారణంగా ఎవరైనా మృతి చెందితే సానుభూతితో వారి కుటుంబ సభ్యులను నిలబెట్టి ప్రత్యర్థి రాజకీయపార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండి సహకరిస్తాయి. గతంలోనూ టీడీపీ ఇలా చేసింది. కానీ చంద్రబాబు ఈసారి మాత్రం ముందుగానే ప్రకటించి సంచలనం సృష్టించారు.




Tags:    

Similar News