ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ చంద్ర‌బాబు స‌భ‌లు.. విష‌యం `అదేన‌ట‌!`

Update: 2021-12-09 02:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక విష‌యాన్ని సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. గ‌త నెల 19న ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై.. వైసీపీ ఎమ్మెల్యేలు.. కొంద‌రు ప‌రుషంగా వ్యాఖ్యానించి దూషించిన విష‌యంపై అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు తీవ్రంగా మ‌థ‌న ప‌డ్డారు. బ‌య‌ట‌కు వ‌చ్చి.. క‌న్నీరు పెట్టుకున్నారు. `ఇది గౌర‌వ స‌భ కాదు.. కౌవ‌ర స‌భ‌` అంటూ.. నిప్పులు చెరిగారు.. తాను ముఖ్యమంత్రిగానే తిరిగి స‌భ‌కు వ‌స్తాన‌ని శ‌ప‌థం చేశారు. అయితే.. ఈ విష‌యం ఇక్క‌డితో వ‌దిలేస్తే.. వైసీపీకి మరింత చాన్స్ ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు.. గ్రామ గ్రామానా.. ఎన్టీఆర్ కుమార్తె, త‌న భార్య అయిన‌.. భువ‌నేశ్వ‌రికి జ‌రిగిన తీవ్ర అవ‌మానాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. ప్ర‌తి గ్రామంలోనూ.. ప్ర‌తి పంచాయ‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. గౌర‌వ స‌భ‌లు పెట్టి.. మ‌హిళల విష‌యంలో వైసీపీ నేత‌లు ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ సీనియ‌ర్ నేత‌లు.. మాజీ ఎమ్మెల్యేలు.. ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు.. గౌర‌వ స‌భ‌లు నిర్వ‌హించి విష‌యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో ప్ర‌త్య‌క్ష బాధితులుగా ఉన్న పార్టీ అదినేత చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగితేనే బాగుంటుంద‌ని.. సీనియ‌ర్ నేత‌ల నుంచి స‌ల‌హాలు.. సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

``సార్‌.. మ‌న వాళ్లు ఏర్పాటు చేస్తున్న గౌర‌వ స‌భ‌ల్లో భువ‌న‌మ్మ గురించి చెప్ప‌డం కంటే.. మీరు స్వ‌యంగా జోక్యం చేసుకుని.. ఆయా స‌భ‌ల్లో పాల్గొని అస‌లు ఏం జ‌రిగిందో వివ‌రిస్తే.. ప్ర‌జ‌ల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది.. సానుభూతి పెరుగుతుంది`` అని వారు సూచిస్తున్న‌ట్టు స‌మాచారం. అంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించే గౌర‌వ స‌భ‌ల్లో స్థానిక నేత‌లతో పాటు చంద్ర‌బాబు పాల్గొనాల‌నేది వారి సూచ‌న‌. గౌర‌వ స‌భ‌ల‌తో పాటు.. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద పెద్ద సెంట‌ర్ల‌ను చూసి.. అక్క‌డ భారీ బ‌హిరంగ స‌భ‌లు ఏర్పాటు చేసి.. ఆయా స‌భ‌ల‌కు చంద్ర‌బాబు హాజ‌రైతే.. విష‌యం మ‌రింత క్లారిటీగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నార‌ట‌.

ఇదిలావుంటే.. ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఎక్క‌డ స‌మావేశం నిర్వ‌హించినా.. త‌న‌కు, తన కుటుంబానికి అసెంబ్లీలో జ‌రిగిన అవ‌మానా న్ని వివ‌రిస్తున్నారు. ఇటీవ‌ల క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన సంద‌ర్భంలో కూడా ఆయ‌న అక్క‌డి స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తూనే.. మ‌రోవైపు.. అసెంబ్లీ ఘ‌ట‌న‌ను కూడా వివ‌రించారు. దీంతో చంద్ర‌బాబు కుటుంబానికి, ముఖ్యంగా అన్న‌గారు ఎన్టీఆర్ కుమార్తె భువ‌నేశ్వ‌రిని `ఇంత మాట‌` అన్నారా? అంటూ.. మ‌హిళ‌ల్లోనూ చ‌ర్చ జ‌రిగింది. అయితే.. స్థానికంగా నేత‌లు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల్లో ఇంత బూమ్ రావ‌డం లేదు. వారు కూడా విడ‌మ‌రిచి చెప్ప‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సీనియ‌ర్లు.. చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ స‌భ‌ల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News