వావ్ వాట్ ఏ చంద్ర‌బాబు స‌వాల్‌.. వైసీపీ రిప్లే ఏమిటో?

Update: 2021-12-12 07:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలెప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటాయి. రాజకీయాల‌ను అనుస‌రించే వాళ్ల‌కు అవి మాంచి కిక్కును అందిస్తారు. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు, అసెంబ్లీలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, స‌భ నుంచి స‌స్పెన్ష‌న్లు, వాకౌట్లు, క‌న్నీళ్లు.. ఇలా ఎంత డ్రామా కావాలో అంత డ్రామా ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. ఓ వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాలు ప‌న్నుతున్నారు. మ‌రోవైపు అధికారాన్ని కాపాడుకోవ‌డం కోసం జ‌గ‌న్ కౌంట‌ర్లు ఇస్తున్నారు. దీంతో అక్క‌డి రాజ‌కీయ వాతావర‌ణం ఎప్పుడూ వేడిగానే ఉంటోంది.

తాజాగా ఆ వేడిని మ‌రింత పెంచుతూ సీఎం జ‌గ‌న్‌కు బాబు మ‌రో స‌వాల్ చేశారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జ‌గ‌న్ త‌మ పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయించాల‌ని బాబు డిమాండ్ చేశారు. అలా చేయిస్తే టీడీపీ ఎంపీల‌తో తాము రాజీనామా చేయిస్తామ‌ని స‌వాల్ విసిరారు. రాష్ట్ర ప్ర‌జ‌లు పాతిక మంది ఎంపీల‌ను ఇస్తే కేంద్రం మెడ‌లు వంచి హోదా తెస్తాన‌ని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నార‌ని బాబు ప్ర‌శ్నించారు. గ‌తంలో త‌మ కేంద్ర మంత్రుల‌తో రాజీనామా చేయించి పోరాడ‌మ‌ని కానీ జ‌గ‌న్ ఇప్పుడు ఏం చేస్తున్నార‌ని బాబు మండిప‌డ్డారు.

మాట తిప్ప‌ను మ‌డ‌మ త‌ప్ప‌ను అని ప్ర‌క‌టించే జ‌గ‌న్‌.. ఇప్పుడు అడుగుల‌న్నీ వెన‌క్కే వేస్తున్నార‌ని బాబు అన్నారు. విశాఖ రైల్వే జోన్‌పై జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పార‌ని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌రణ‌పై కూడా ద్రోహ‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రానికి రెండు క‌ళ్ల‌లాంటి పోల‌వరం, అమ‌రావ‌తిని ప‌ట్టించుకోకుండా ఆ క‌ళ్ల‌ను వైసీపీ పొడిచేసింద‌ని బాబు దుయ్య‌బ‌ట్టారు. తాజాగా ఓటీఎస్ పేరుతో బ‌ల‌వంతపు వ‌సూళ్ల‌కు సిద్ధ‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు.

ఇప్పుడు బాబు విమ‌ర్శ‌ల‌కు వైసీపీ నాయ‌కులు ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారోనన్న ఆస‌క్తి క‌లుగుతోంది. బాబు ఒక్క మాట అంటే దానికి స‌మాధానంగా ప‌ది మాట‌లు చెప్పే వైసీపీ నేత‌లు.. ఈ విష‌యంపై ఎలా స్పందిస్తారో చూడాలి.  రాష్ట్ర ప్ర‌త్యేక హోదా కోసం బాబు త‌న హ‌యాంలో ఏమీ చేయ‌లేద‌ని.. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం సిగ్గుచేట‌ని ఇప్ప‌టికే కొన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాబు చేసిన స‌వాల్ మ‌రోసారి రాజ‌కీయ ఆట‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News