వైసీపీకి లాభం చేయించ‌లేనంటున్న బాబు

Update: 2017-03-16 16:38 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌డం, పోల‌వ‌రం నిర్మాణానికి నిధుల భ‌రోసా ఇచ్చిన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ చ‌ర్చ జ‌రిగింది. అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. దేశంలో అతి పెద్ద ప్రాజెక్టులలో పోలవరమే చివరి ప్రాజెక్టు అని చెప్పారు. పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనకు రావడం తన పూర్వ జన్మ సుకృతమని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం సోమవారం పేరును తన డైరీలో పోలవరంగా మార్చుకున్నానని చెప్పారు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టును సమర్థవంతంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఒక్క ఏపీ ప్రభుత్వానికే ఉందని, అందుకే ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని నీతి అయోగ్ చెప్పిందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వమే చేపట్టి ఉంటే దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి వ‌లే పోలవరం పరిస్థితి కూడా అలాగే ఉండేదని చంద్రబాబు అన్నారు. పోలవరం పనులు ఇప్పటి వరకూ 44 శాతం పూర్తయ్యాయని చంద్రబాబు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018నాటికల్లా గ్రావిటీతో నీళ్లు తేవాలన్నది ఉక్కు సంకల్పంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 సార్లు పోలవరం పనులను తనిఖీ చేశాననీ, 18 సార్లు పర్చువల్ ఇన్ స్పెక్షన్ చేశానని చంద్రబాబు అన్నారు. అయితే ఈ చర్చ సందర్భంగా విపక్ష నేతలు నినాదాలతో సభాకార్యక్రమాలకు అడ్డు తగలడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్న విపక్ష సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ రౌడీయిజం సభలో చెల్లదని స్పష్టం చేశారు. అవాస్తవాలు మాట్లాడడం ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామంటే అది జరగదని చంద్రబాబు అన్నారు. సభలో వైసీపీ అసత్యాలు మాట్లాడుతూ అదే సత్యమని నమ్మించాలని ప్రయత్నిస్తోందని చంద్ర‌బాబు విమర్శించారు.ఇది బూమరాంగ్ అవుతుందని, డిపాజిట్లు కూడా రాని పరిస్థితి విపక్ష సభ్యులకు ఎదుర‌వుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News