అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌పై బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

Update: 2017-11-08 04:41 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబుకు పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు పోల‌వ‌రం - రాజ‌ధాని - నిధులు వంటివే కీల‌క‌మైన పెద్ద స‌మ‌స్య‌లుగా ఆయ‌న భావిస్తూ వ‌చ్చారు. అయితే - విప‌క్ష నేత జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు కంట్లో న‌ల‌సులా బాబుకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంద‌ని తాజాగా అమ‌రావ‌తిలోని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున బాబు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, జ‌గ‌న్ ఒక్క‌స‌రిగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బాబుకు పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి.. టీడీపీలో చేర్చుకున్నార‌ని, వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న అసెంబ్లీ స‌మావేశాల‌ను బాయ్‌ కాట్ చేశారు. ఈ ఊహించ‌ని ప‌రిణామాన్ని మొదట తేలిక‌గా తీసుకున్న చంద్ర‌బాబు.. అసెంబ్లీ స‌మావేశాలు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. తీవ్ర ఆవేద‌న‌లో మునిగిపోయార‌ని తెలుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ అసెంబ్లీని బాయ్ కాట్ చేయ‌డంపై టీడీపీ నేత‌ల‌తో విమ‌ర్శ‌లు చేయించాల‌ని ప్లాన్ చేసినా.. నేత‌లు మైకుల ముందుకు వ‌చ్చి బాబు స్క్రిప్టు చ‌దివినా జ‌నాల్లోకి అంత‌గా వెళ్ల‌లేదు. మ‌రోప‌క్క జ‌గ‌న్ బాయ్‌ కాట్ మాత్రం ప్ర‌జ‌ల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీనిపై రిపోర్ట్ అందుకున్న చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం హుటాహుటిన సచివాలయంలోని తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చలు జరిపారు.

ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించారు. ప్రతిపక్షం లేకపోయినా మ‌సిపూసి మారేడు కాయ చేసిన విధంగా తమ పార్టీ వారితోనే ప్రశ్నలు అడిగించి వాటికి సమాధానం చెప్పించాలని నిర్ణయించారు.  ఈ సందర్భంగా ప్రశ్నలను తయారు చేయాలని ఏకంగా మంత్రుల‌కే బాబు సూచించారు. సింగపూర్‌ లో ప్రతిపక్షం పాత్ర పెద్దగా ఉండదని - అధికార పక్షమే పార్లమెంటు సమావేశాల్లో సమస్యలను లేవనెత్తి పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని చెప్పిన చంద్రబాబు ఈ సమావేశాల్లో అదే విధానాన్ని అనుసరించాలని చెప్పారట‌.  

అయితే, మీడియాలో ఎక్క‌డా పాద‌యాత్ర గురించి కాకుండా జ‌గ‌న్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన విష‌యంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సంధించేలా మ‌ళ్లీ స్ర్కిప్టు సిద్ధం చేయాల‌ని కూడా సూచించిన‌ట్టు తెలిసింది. ఏదేమైనా జ‌గ‌న్ ఇచ్చిన ఝ‌ల‌క్‌ తో బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని అంటున్నాయి అమ‌రావ‌తి వ‌ర్గాలు. మ‌రి బాబు అసెంబ్లీని ఎలా న‌డిపిస్తారో చూడాలి. విప‌క్షం పూర్తిగా లేకుండా స‌భ న‌డ‌వ‌డం అంటే దేశంలో స‌రికొత్త రికార్డు న‌మోదు చేయ‌డ‌మే అంటున్నారు విశ్లేష‌కులు. ఇది మంచి ప‌రిణామం కాద‌ని - విప‌క్షానికి న‌చ్చ‌జెప్పి అయినా స‌భ‌కు వ‌చ్చేలా చూడాల‌ని ఇప్ప‌టికే బాబు ప‌లు రాజ‌కీయ వ‌ర్గాల నుంచి స‌ల‌హాలు వెళ్లాయ‌ని - అయినా కూడా బాబు ఖాత‌రు చేయ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News