ఇంటి పెద్ద అయితే ఇంత ర‌చ్చ చేయ‌రుగా బాబు?

Update: 2019-04-21 05:11 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ల్ని కాసేపు ప‌క్క‌న పెట్టేద్దాం. లాజిక్ గా ఆలోచిద్దాం. దానికి ఏదో ఒక ఉదాహ‌ర‌ణ తీసుకునే క‌న్నా.. అంద‌రికి తెలిసిన ఎగ్జింఫుల్.. నిత్యం మ‌నంద‌రం చూసే విష‌యాన్నే చూద్దాం. మీ ఇంట్లో కానీ.. ఎవ‌రి ఇంట్లో అయినా కానీ.. ఏదైనా ఇష్యూ వ‌చ్చింద‌నే అనుకుందాం.. అప్పుడేం చేస్తాం.. ఇంటిపెద్ద ఇంట్లో వారితో విడివిడిగా మాట్లాడి ఇష్యూ క్లోజ్ చేయ‌టం కానీ.. లేదంటే.. అంద‌రిని కూర్చోబెట్టి మాట్లాడ‌టం కానీ చేస్తారు. త‌న వ‌ల్ల కాద‌న్న‌ప్పుడు.. తాను మాట్లాడితే బాగోద‌న్న‌ప్పుడు ఎవ‌రినైనా పెద్ద మ‌నిషిని ఇంట్లోకి తీసుకొచ్చి వారి చేత చెప్పించాల్సిన విష‌యాల్ని చెప్పించ‌టం చూస్తుంటాం.

మ‌రి.. ఏపీ రాష్ట్రం అనే ఇంటికి త‌న‌ను తాను ఇంటి పెద్ద‌గా చెప్పుకుంటున్న చంద్ర‌బాబు.. ఏదైనా ఇష్యూలో స్పందించాల్సి వ‌స్తే ఎలా రియాక్ట్ కావాలి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. వ్య‌వ‌స్థ‌ల్ని కాపాడుకోవ‌టానికి కుటుంబ పెద్ద‌గా మాట్లాడాన‌ని.. తాను మాట్లాడిన మాట‌ల‌న్నీ ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌ప్పించి.. ఏ వ్య‌క్తిని చిన్న‌బుచ్చ‌టానికి కాద‌ని.. మ‌నోభావాల్ని గాయ‌ప‌ర్చ‌టానికి కాద‌ని చెబుతున్న బాబు మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఈసీని టార్గెట్ చేయ‌టం.. ఎన్నిక‌ల జ‌రిగిన తీరుపై నిప్పులు చెర‌గ‌ట‌మే కాదు.. జాతీయ స్థాయిలో నేత‌ల్ని కూడ‌గ‌డుతున్న చంద్ర‌బాబు.. ఉన్న‌ట్లుండి తాను వ్య‌వ‌హ‌రించిన తీరుపై కొత్త త‌ర‌హా వాయిస్ ను వినిపించటం గ‌మ‌నార్హం.

భార‌త సివిల్ స‌ర్వీసెస్ డే సంద‌ర్భంగా కొత్త రాష్ట్రం కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతున్న అధికారుల‌కు త‌న శుభాకాంక్ష‌లు అంటూ విషెస్ చెప్పిన ఆయ‌న‌.. త‌న‌ను తాను ఇంటి పెద్ద‌గా అభివ‌ర్ణించుకున్నారు. నిజ‌మే.. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వారు ఇంటి పెద్దే అవుతారు. ఇంటి పెద్ద అన్న మాట ప్ర‌స్తావించిన‌ప్పుడు.. మ‌రి అదే తీరులో బాబు వ్య‌వ‌హ‌రించారా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎక్క‌డిదాకానో ఎందుకు?  ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా బాబు చేసిన హ‌డావుడి చూస్తే తెలుస్తుంది.

పోలింగ్ సంద‌ర్భంగా ఏదో జ‌రిగిపోతుందంటూ.. ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. పోలింగ్ కు ఒక్క‌రోజు ముందు ఈసీని క‌లిసి.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. దానికి సంబంధించిన మీడియా పుటేజ్ ను బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేయ‌టం దేనికి నిద‌ర్శ‌నం?  బాబు చెప్పిన‌ట్లు.. ఇంటి పెద్ద‌గా ఉండ‌టం అంటే..ఏదైనా ఇష్యూ వ‌చ్చిన‌ప్పుడు త‌న ఇమేజ్ ను పెంచుకోవ‌టానికి.. అధికారుల్ని బ‌లిప‌శువుల్ని చేయ‌టం ఎంత మాత్రం కాద‌న్న విష‌యాన్ని బాబు మ‌ర్చిపోతే ఏమీ చేయ‌లేం. ఇంటి పెద్ద అన్న ప‌దం బాధ్య‌త‌తో కూడిందన్న‌ది మ‌రిస్తే ఎలా?  త‌న ప‌వ‌ర్ ను ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి అదే ప‌నిగా ఇష్ట‌ప‌డే బాబు లాంటి వారు ఇంటి పెద్ద పాత్ర‌కు సూట్ కాలేర‌న్న విష‌యం ఆయ‌న‌కు తెలియకున్నా.. ఆయ‌న్ను ఎంతోకాలంగా చూస్తున్న‌ ప్ర‌జ‌లకు మాత్రం బాగానే తెలుస‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News