కేసీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేలా బాబు తాజా వ్యాఖ్యలు

Update: 2022-07-29 04:53 GMT
అప్పటివరకు బాగానే ఉన్నట్లు ఉంటారు. అంతలోనే అనూహ్యంగా వ్యవహరించే ధోరణి టీడీపీ అధినేత చంద్రబాబులో కనిపిస్తూ ఉంటుంది. కాస్తంత సానుకూలత కనిపిస్తే చాలు.. ఆయనలోని పాత చంద్రబాబు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తారు. కానీ.. ఆయన మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. ఇప్పుడు కాలం మారింది.రాజకీయం పూర్తిగా మారింది. తన పేరుతో జరిగే భావోద్వేగ రాజకీయాలు తన ప్రయోజనాల్ని దెబ్బ తీస్తుందన్న విషయాన్ని చంద్రబాబు అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. తాజాగా అలాంటి తీరే బాబులో మరోసారి కనిపించింది.

2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమాయానికి కేసీఆర్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాంటి కేసీఆర్ అనూహ్యంగా భారీ ఎత్తున ఎన్నికల్లో విజయం సాధించటానికి కారణం.. చంద్రబాబే అన్న మాట రాజకీయ విశ్లేషకులు తరచూచెబుతుంటారు. అంత వరకు ఎందుకు.. టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో చంద్రబాబు ఒక్కరు ఉంటే చాలు.. తమ అధికారానికి ఢోకా ఉండదని చెబుతారు.

చంద్రబాబు తెలంగాణలో ఎంత ఎక్కువగా తిరిగి ప్రచారం చేస్తారో.. అంతలా ఆయనకు నష్టం వాటిల్లటమే కాదు.. టీఆర్ఎస్ కు అంత మేలు చేసినట్లుఅవుతుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. నిజానికి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారానికి రానంత వరకు ఒక తీరులో.. బాబు ఎంట్రీ ఇచ్చి.. ప్రచారం చేయటం షురూ చేసిన తర్వాత నుంచి రాజకీయ సమీకరణాలు మారిపోవటమే కాదు.. ఓటర్ల ఆలోచనలోనూ మార్పు వచ్చిందన్న విషయాన్ని మర్చిపోలేం.

అప్పటివరకు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆలోచించిన వారు సైతం.. చంద్రబాబు ప్రచారంతో ఏపీ ఏలుబడిలోకి తెలంగాణ వెళుతుందంటూ గురి చూసి కొట్టిన కేసీఆర్ మాటలకు ఇట్టే కనెక్టు కావటం.. టీఆర్ఎస్ ఘన విజయానికి కారణమన్న విషయం తెలిసిందే. తెలంగాణలో పార్టీకి ఎదురైన పరాజయం కంటే కూడా కేసీఆర్ అధికారంలోకి రావటంలో చంద్రబాబే కీలకమన్న వ్యాఖ్య చంద్రబాబును బాధించినట్లుగా చెబుతారు. ఈ కారణంతోనే ఆయన తెలంగాణ విషయాన్ని తక్కువగా ప్రస్తావించటం.. పార్టీ ఉనికి లేకున్నా.. ఫోకస్ మొత్తం ఏపీ మీదనే పెట్టటం తెలిసిందే.

అలాంటి చంద్రబాబు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బూర్గంపహాడ్ మండలంలోని వరద బాధితుల్ని పరామర్శించారు. వరదల కారణంగా మరణించిన కుటుంబానికి రూ.లక్ష సాయాన్నిఇవ్వటాన్ని తప్పు పట్టలేం. తన పరామర్శ ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలే ఆయన్ను దెబ్బ తీస్తాయన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో ఉనికే లేని పార్టీ కాస్తా.. తెలంగాణలో తెలుగుదేశం బలపడుతోందన్న అనవసరమైన వ్యాఖ్యలు కేసీఆర్ కు కలిసి వచ్చేలా చేస్తాయన్న విషయాన్ని చంద్రబాబు మిస్ కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

పార్టీకి ఖమ్మం జిల్లాతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించటం వరకు ఓకే అయినా.. తెలంగాణ మీద తనకున్న ఆశను.. సమయం కాని సమయంలో ప్రస్తావించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. తెలంగాణలో టీడీపీ ప్రస్థానం ముగిసిన విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. ఇలాంటి వేళ.. తెలంగాణలోని ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాల్లో చుట్టపు చూపుగా వెళ్లాలే తప్పించి.. అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదు. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే.. వెళ్లామా? వచ్చామా? అన్నట్లు ఉండాలే తప్పించి.. రాజకీయ ప్రయోజనం కోసం ఆశించి తెలంగాణ ప్రాంతాల్లో పర్యటించినట్లుగా అస్సలు ఉండకూడదు. అలాంటి ఆలోచన కూడా తనకు నష్టం జరిగేలా.. కేసీఆర్ కు మరింత లాభం చేకూరేలా చేస్తుందన్న విషయాన్ని చంద్రబాబు ఏ క్షణంలోనూ మరచిపోకూడదని చెబుతున్నారు.
Tags:    

Similar News