కాళేశ్వరంపై సీబీఐకు ఫిర్యాదు.. టార్గెట్ కేసీఆర్, మేఘా నేనా?

Update: 2022-08-09 09:30 GMT
తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు షురూ అయ్యాయి. ఇక్కడి కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఫైట్ చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ తెలంగాణలో తలపెట్టిన లక్ష కోట్ల ప్రాజెక్ట్ 'కాళేశ్వరం'లో అవినీతిని తవ్వితీయడానికి రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల వర్షాలకు మునిగిన 'కాళేశ్వరం' ప్రాజెక్టును టార్గెట్ చేశాయి. అక్కడి పంపుహౌస్ లు మునగడంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పై విమర్శలు గుప్పించాయి.

కాళేశ్వరం మునగకు చేపట్టిన మేఘా కంపెనీ నిర్వాకంపై పోరాటం చేస్తానని ఇప్పటికే వైఎస్ షర్మిల ప్రకటించారు. షర్మిల మాత్రమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి కాంగ్రెస్ పార్టీ నేత, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఫిర్యాదు చేయడంతో ఇది రాజకీయ ప్రతీకారంగా మారింది.

ఇక షర్మిల, కాంగ్రెస్ నే కాదు.. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కూడా కలిసి కాళేళ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ కూడా సీబీఐకి కాళేశ్వరంపై ఫిర్యాదు చేయడంతో ఇది మరింత రాజుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు, మేఘా కంపెనీపై ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ సీబీఐకి, నీతిఅయోగ్ లకు ఫిర్యాదు చేశాడు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేసి అశాస్త్రీయంగా నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, బాహుబలి మోటార్ల మరమ్మతు ఖర్చులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ జడ్సన్ ఫిర్యాదు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదట దాదాపు రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందని భావించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత 2020 నాటికి ప్రాజెక్టు బడ్జెట్ ను రూ.88వేల కోట్లకు పెంచారు. ఇప్పటివరకూ 1.15 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం గత నాలుగేళ్లలో రూ.3982 కోట్లు ఇచ్చిందని.. పీఎంకేఎస్ వై, ఏఐబీపీ, సీఏడబ్ల్యూఎం పథకాల కింద కేంద్రం రూ.1195 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రనిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మొత్తం రూ.1,15,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ కూడా విచారణ జరుపుతామని కాచుకు కూర్చుంది. ఇప్పుడు తగలబోయిన తీగ కాలికి తగిలినట్టు కాంగ్రెస్ ఫిర్యాదుతో సీబీఐతో దీనిపై విచారణ జరిపే చాన్స్ కూడా ఉందంటున్నారు. ఇదే జరిగితే అతిపెద్ద సంచలనమవుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం స్పందిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News