2021లోగా పోలవరం పూర్తి... కేంద్రం సంచలన ప్రకటన

Update: 2020-02-10 15:46 GMT
నవ్యాంధ్రప్రదేశ్ కు జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు పై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కీలక ప్రకటన చేసింది. 201లోగా ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టుకు నిధులన్నీ తానే ఇస్తున్నట్లుగా మరోమారు క్లారిటీ ఇచ్చిన మోదీ సర్కారు... ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం... పెట్టిన ఖర్చుకు సంబంధించిన ఆడిట్ వివరాలను సమర్పిస్తే తప్పించి... తదుపరి నిధులు విడుదల చేసేది లేదని తేల్చి చెప్పింది. ఓ వైపు నిధుల విడుదల, మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే గడువుపై కేంద్రం ప్రకటన చేయడం నిజంగానే సంచలనమని చెప్పక తప్పదు.

మొన్నటిదాకా టీడీపీలో ఉండి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా మారిపోయిన రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రం పై సమాధానం చెప్పింది. ఎప్పటిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారంటూ సుజనా ప్రశ్నించగా... వచ్చే ఏడాది (2021)లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. గతంలో ఈ ప్రాజెక్టు గడువును 2019 గానే కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్టులోని వివిధ భాగాలకు చెందిన కాంట్రాక్టు సంస్థల నిర్వహణ కారణాలతోనే గడువును ఇప్పుడు పొడిగిస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. కేంద్రం విధించిన డెడ్ లైన్ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ఏ మేరకు పరుగులు పెట్టిస్తుందో చూడాలి.

ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమై నిధులు, ఇప్పటిదాకా అయిన ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధుల వివరాలపై కూడా కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం రూ.3047 కోట్లు ఖర్చు చేశారని.. వీటిలో ఇప్పటిదాకా రూ.1400 కోట్లను విడుదల చేశామని తెలిపింది. ఇంకా విడుదల చేయాల్సిన నిధుల గురించి కేంద్రం మరో సంచలన ప్రకటన చేసింది. ఖర్చు చేసిన నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ రిపోర్టును అందిస్తేనే మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల ఆడిట్ జరగకుండా నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని ఆర్థికశాఖ నవంబర్ 26, 2019న నోట్ ఇచ్చినట్టు గుర్తు చేసింది. మొత్తంగా ఓ వైపు గడువు విధిస్తూనే... నిధుల విడుదలలో మాత్రం జవాబుదారీ తనాన్ని పాటించాల్సిందేనంటూ కేంద్రం పేర్కొనడం సంచలన నిర్ణయంగా పరిగణించక తప్పదు.
Tags:    

Similar News