రాహుల్ పై 'డ్రగ్స్' కామెంట్లు..స్వామిపై కేసు నమోదైంది

Update: 2019-07-07 16:47 GMT
సుబ్రహ్మణ్య స్వామి... తమిళనాడుకు చెందిన ఈ కాషాయ నేత ఏ ఒక్కరికీ కొరుకుడు పడని నేతే. అసలు ఈ పేరు వింటేనే వివాదాలకు మించి వివాదాలే గుర్తుకు వస్తాయి. నిత్యం ఏదో అంశంపై తనదైన శైలిలో కామెంట్లు చేయడం, దానిపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరగడం మనకు తెలిసిందే. అలాంటి ఘటనే ఇప్పుడు మరొకటి జరిగింది. ఈ ఘటనలో ఏకంగా స్వామిపై కేసు కూడా నమోదైపోయవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీపై డ్రగ్స్ వ్యాఖ్యలు చేసిన స్వామిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.

ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన పూర్వపరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో పర్యటించిన సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి... రాహుల్ గాంధీపై తనదైన శైలి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మాదక ద్రవ్యాలు తీసుకుంటారని, అందులో ప్రత్యేకించి కొకైన్ ను రాహుల్ బాగానే వాడతారంటూ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను బాగానే హర్ట్ చేసినట్టు ఉన్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్ గడ్ లోని జష్ పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆదారం చేసుకుని ఫతల్గావ్ పోలీస్ స్టేషన్ లో స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.

పవన్ అగర్వాల్ తన ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారంటే.. రాహుల్ గాందీపై చేసిన వ్యాఖ్యలు తప్పని స్వామికి తెలుసు. అయినా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే... రాహుల్ గాంధీని అవమానించడమే అవుతుందని కూడా స్వామికి తెలుసు. ఇన్నీ తెలిసే స్వామి ఈ వ్యాఖ్యలు చేశారంటే.. రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం పెంచి ప్రజలను రెచ్చగొట్టాలన్నదే స్వామి ఆలోచన. ఈ తరహా వ్యాఖ్యలతో సమాజంలో అశాంతి రేకెత్తుతుంది. దీంతో స్వామిపై కేసు నమోదు చేయడంతో పాటుగా కఠినంగా శిక్షించాలి‘ అని అగర్వాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు... స్వామిపై ఐపీసీ సెక్షన్ 505, సెక్షన్ 511 ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీతో పాటు ఆయన తల్లి సోనియా గాంధీని మొత్తంగా కాంగ్రెస్ పార్టీనే ముప్పుతిప్పలు పెట్టిన స్వామి... మరి ఈ కేసు నుంచి ఎలా తప్పించుకుంటారో చూడాలి.
Tags:    

Similar News