సిద్ధూకి అధిష్టానం షాక్

Update: 2021-08-26 06:30 GMT
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ను మార్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్టానం తేల్చిచెప్పింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కెప్టెన్ నేతృత్వంలోనే జరుగుతాయని కాంగ్రెస్ నాయకత్వం తేల్చిచెప్పడంతో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూకి షాకిచ్చినట్లే ఉంది. మామూలుగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాల నాయకుల మధ్య చెక్ అండ్ కౌంటర్ చెక్ పెడుతుంది. అలాగే పంజాబ్ విషయంలో కూడా నడుచుకుంటోంది. చాలాకాలంగా పంజాబ్ లో సీఎం అమరీందర్ కు సిద్ధూకి ఏ మాత్రం పడటం లేదు.

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య సయోధ్య చేయడం కోసం అమరీందర్ కు ఇష్టం లేకపోయినా సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిగా ఈ మధ్య నియమించింది. అప్పటి నుండి సిద్ధూ రెచ్చిపోతున్నారు. ఇద్దరి మధ్య గొడవలు తారస్ధాయికి చేరుకోవటానికి ప్రధాన కారణం రాబోయే ఎన్నికల్లో టికెట్ల కోసమే అని అందరికీ తెలిసిందే. ఇద్దరు కూడా తమ మద్దతుదారులకే అత్యధిక టికెట్లు ఇప్పించుకోటమే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు.

తన వర్గానికి అమరీందర్ అన్యాయం చేస్తాడన్న భయంతోనే పదే పదే అధిష్టానంతో పోరాడి పీసీసీ అధ్యక్షపదవిని సాధించుకున్నారు. ఇపుడిదే భయం అమరీందర్ లో మొదలైంది. ముఖ్యమంత్రిగా తానున్నా పీసీసీ అధ్యక్షుని హోదాలో సిద్ధూ తన మద్దతుదారుల టికెట్లకు ఎక్కడ అడ్డుకట్టవేస్తారో అనే టెన్షన్ కెప్టెన్లో పెరిగిపోతోంది. ఇదే సమయంలో అసలు సీఎంనే మార్చేస్తే ఇక ఎలాంటి సమస్యా ఉండదని సిద్ధూ ప్లాన్ చేశారు.

అందుకనే మంత్రి వర్గంలోని నలుగురు మంత్రులు+26 మంది ఎంఎల్ఏలతో అమరీందర్ పై తిరుగుబాటు లేవదీశారు. తెరపైన ఎక్కడా తాను లేకుండానే వెనుక నుండి సిద్ధూయే వ్యవహారం నడుపుతున్నారని అమరీందర్ ఫిర్యాదులు చేశారు. సరే ఎవరి ప్రయత్నాలు, ఎవరి ఫిర్యాదులు ఎలాగున్నా సీఎంను మార్చేది లేదని చెప్పేసింది. అమరీందర్ నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు అధిష్టానం తేల్చి చెప్పేసింది. దీంతో సిద్ధూతో పాటు ఆయన మద్దతుదారులకు గట్టి షాక్ తగిలినట్లే అనుకోవాలి. మరిప్పుడు వాళ్ళేం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News