ఫేస్ బుక్ లో నిజాలు చెబితే స‌స్పెండ్ చేశారు

Update: 2017-05-17 05:48 GMT
పోలీసులైనా వాళ్లూ మ‌నుషులే. కొంద‌రు ఒంటిపై ఖాకీ డ్రెస్సు ప‌డితే ఈ విష‌యాన్ని మ‌రిచిపోతారు. ఇంకొంద‌రు... తామూ మ‌నుషుల‌మే అన్న ఎరుక‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అలాంటి వారిని చూసిన‌పుడు పోలీసుల‌పై గౌర‌వం ఇనుమ‌డిస్తుంది. ఇటీవ‌లే చ‌త్తీస్‌ ఘ‌డ్ లో పోలీసు అధికారి వ‌ర్ష డోంగ్రే  (35) వ్య‌వ‌హ‌రించిన తీరు గ‌వ‌ర్న‌మెంటుకు కోపం తెప్పిస్తే... సామాన్య జనానికి మాత్రం తెగ న‌చ్చింది. ఇంత‌కీ ఆమె చేసిన ప‌నేంటో తెలిస్తే మీరూ ఆమెను మెచ్చుకుంటారు. మంచి ప‌ని చేసి స‌ర్కారుకు కోపం ఎందుకొచ్చిందో తెలిస్తే... మీరూ ఆశ్చ‌ర్య‌పోతారు.

వ‌ర్ష‌ ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ్ పూర్ జైలు డిప్యూటీ సూప‌రింటెండెంట్. గ‌తంలో ఓ దారుణ అనుభ‌వాన్ని ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పంచుకొంది. ఆ అనుభ‌వం ఏంటంటే... కొన్నేళ్ల క్రితం తాను విధులు నిర్వ‌ర్తించే జైల్లో ఖైదులో ఉన్న‌ న‌లుగురు ఆదివాసీ బాలిక‌ల్ని చూసింది. ఆమెను గ‌మ‌నించిన వెంట‌నే బాలిక‌లు వ‌ణికిపోయారు. వార‌లా వ‌ణ‌క‌డంతో ఆమెకు సందేహం వ‌చ్చి ప‌రీక్ష‌గా చూసింది. వారి శ‌రీరాల‌పై కొన్ని గుర్తులున్నాయి. వెంట‌నే.. వారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ప‌రీక్ష‌ల అనంత‌రం ఆమెకు కొన్ని భ‌యంక‌ర‌మైన నిజాలు తెలిశాయి. ఆ పిల్ల‌ల చేతుల‌పై, రొమ్ముల‌పై క‌రెంటు షాకులిచ్చి మ‌రీ హింసించారు. ఆ బాలిక‌లంద‌రూ 14 నుంచి 16 మ‌ధ్య వ‌య‌స్కులే.  మావోయిజానికి సంబంధించిన ఆరోప‌ణ‌ల‌పై జైల్లో ఉన్నారు. ఎంత మావోయిజం అయితే మాత్రం అంత హింసిస్తారా? అని ఆమె బాధ‌ప‌డింది. ఈ  పాత సంఘ‌ట‌న‌ను ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పంచుకుంది. అంతే.. ఆమె విధుల నుంచి స‌స్పెండ్ అయ్యారు. వ‌ర్ష చేసిన కామెంట్లు ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారాయి. ఆమెను రాయ్ పూర్ నుంచి 350 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అంబికాపూర్ జైలుకు బ‌దిలీ చేశారు. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నారు.

దీనిపై ఆమె గ‌ళం విప్పారు. తాను అధికారిక స‌మాచారాన్నో.. అధికారిక ర‌హ‌స్యాల్నో బ‌య‌ట‌పెడితే స‌ర్వీసు నిబంధ‌న‌ల్ని బ్రేక్ చేసిన‌ట్లు అవుతుంద‌ని.. క‌ళ్ల‌తో చూసిన చిత్ర‌హింస‌ల వివ‌రాలు బ‌య‌ట‌పెడితే ఎలా శిక్ష విధిస్తారంటూ ఆమె ప్ర‌శ్నిస్తోంది. దేశ ప్ర‌జలంద‌రితో పాటు త‌న‌కూ భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉంద‌ని వాదిస్తున్నారు. 2008-10 మ‌ధ్య జ‌గ‌ద‌ల్పూరు జైల్లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఇపుడ ఈ రచ్చ‌కు కార‌ణం కావ‌డం విచిత్రం. 


Tags:    

Similar News