తెలంగాణలో ప్రతి అంగుళాన్ని కేసీఆర్ శోధించారా?

Update: 2021-11-07 10:30 GMT
తాను కోరి తెచ్చుకోని దుబ్బాక దిమ్మ తిరిగిపోయే షాకిస్తే.. అన్ని లెక్కలు జాగ్రత్తగా వేసుకొని.. తెలంగాణ ప్రజల మైండ్ సెట్ తనకెవరూ చెప్పాల్సిన అవసరం లేదని.. తెలంగాణ ప్రజల మనసుల్ని తాను చదివినంత బాగా మరెవరూ చదవలేరన్న విషయాన్ని చెప్పే గులాబీ బాస్ కేసీఆర్ కు ఎదురుదెబ్బలు ఎందుకు తగులుతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయాల్లో ఆయనకు ఓటమి ఎందుకు స్వాగతం పలుకుతోంది? ఆయన అంచనాలు ఎందుకు విఫలమవుతున్నాయి? తెలంగాణలో ప్రతి అంగుళాన్ని శోధించినట్లుగా గొప్పగా చెప్పకునే కేసీఆర్ కు చేదు అనుభవాలు ఎందుకు ఎదురవుతున్నాయి? లాంటి ప్రశ్నలు ఎన్నో ఎదురవుతున్నాయి.

నిజంగానే తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని శోధించానన్న కేసీఆర్ మాటలతో కొంత నిజం ఉన్నప్పటికీ.. ఆ వాస్తవానికి మసకబట్టేలా అధికారం ఆయనకు ఇప్పుడో శాపంగా మారింది. అధికారం చేతిలోకి వచ్చాక ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. ఇదే అహంకారాన్ని అంతకు మించి.. నిజాన్ని నిజంగా చూసే ఒక ప్రత్యేక లక్షణాన్ని మిస్ అయ్యేలా చేస్తుంది. కేసీఆర్ విషయంలో జరుగుతున్నది ఇదే. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల గోస.. వారి అంతర్మధనం.. వారి ఆశలు.. ఆశయాల్ని దగ్గరగా చూసిన ఆయన.. కాల క్రమంలో తనకు అన్ని తెలుసని.. తెలియాల్సింది.. తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదన్న భావన అంతకంతకూ ఎక్కువ కావటమే ఆయనకు గెలుపు దూరమై.. ఓటమి దగ్గరైందని చెప్పాలి.

తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజలు ఫీలయ్యే దాని కంటే కూడా.. తెలంగాణ ప్రజలు భావించాలన్నట్లుగా కేసీఆర్ తీరు మారటమే ఆయన్ను ప్రజలకు దూరమయ్యేలా చేస్తుందన్న విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల ప్రజల్లో తెలంగాణ ప్రజల తీరు మిగిలిన వారికి కాస్త భిన్నం. వారికి అహంభావం.. అహంకారం.. అధికారం.. అన్నది అస్సలు నచ్చవు. ఆ మూడింటితో తమను రిమోట్ కంట్రోల్ మాదిరి చేసి ఆడిస్తానంటే ససేమిరా అంటారు.

దశాబ్దాల తరబడి రజకార్ల ఏలుబడిలో నలిగిన తెలంగాణ ప్రజలు.. తాము పోరాడి సాధించుకున్న స్వేచ్ఛను రాజకీయ అవసరాల కోసం.. తాయిలాల కోసం తాకట్టు పెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ప్రజల్లో తమ ప్రాంతాన్ని అమితంగా ఆరాధించే భావన ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందుకోసం దేనికైనా అన్నట్లు వారు వ్యవహరిస్తారు. తమ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేసి.. తమను తోలుబొమ్మలు మాదిరి ఆడిస్తామని ప్లాన్ చేసే వారు కేసీఆర్ అయితే మాత్రం.. తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరించటం తెలంగాణ ప్రజలకున్న విలక్షణత.

ఈ కీలకమైన విషయాన్ని మిస్ అయిన కేసీఆర్.. తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని శోధించినట్లుగా గొప్పలు చెప్పుకున్న ప్రతిసారి చేదు అనుభవాన్ని మిగిల్చేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉంటారన్నది మర్చిపోకూడదు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత త్వరగా ఆయన నోటి నుంచి ‘తెలంగాణలో ప్రతి అంగుళాన్ని శోధించాను’ లాంటి మాటల్ని రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News