ఎగ్జిట్ ఎఫెక్ట్: కాంగ్రెస్ కు స్టాలిన్ షాక్?!

Update: 2019-05-20 08:26 GMT
కాంగ్రెస్ పార్టీ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది డీఎంకే. తమిళనాట సీట్ల షేరింగ్ తో కాంగ్రెస్ –డీఎంకేలు పోటీ చేశాయి. ఏ పార్టీ కాంగ్రెస్ వెంట ఉండకపోయినా డీఎంకే మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ వెంట ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేత ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చినట్టుగా మాట్లాడారు. ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ మీటింగుకు హాజరయ్యే విషయంలో స్టాలిన్ స్పందిస్తూ..

'ఇప్పుడు ఆ సమావేశం అవసరమే లేదు..' అన్నట్టుగా వ్యాఖ్యానించడం ఆసక్తిదాయకంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తీరుతోనే స్టాలిన్ ఈ వ్యాఖ్య చేశారా?  అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కూటమికి ఛాన్సే లేదు అని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. ఎన్డీయేలోకి కొత్త పార్టీల అవసరం కూడా లేకుండా బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి పార్టీలు వెనుకాడే పరిస్థితి వచ్చింది.

అందులో భాగంగానే స్టాలిన్ కూడా రూటు మార్చాడా? బీజేపీకి చేరువ అయ్యేందుకు స్టాలిన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడా? అనే చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం చాలా అవసరం స్టాలిన్ కు.

ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చు అనే విశ్లేషణలు ముందు నుంచినే ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినా - ఆయన బీజేపీ వైపు వెళ్లవచ్చు అనే ఊహాగానాలున్నాయి. అయితే పోలింగ్ జరిగినంత సేపూ స్టాలిన్ ఆ ఊహాగానాలను ఖండిస్తూ వచ్చాడు. ఇప్పుడు మాత్రం మే ఇరవై మూడున బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం అవసరమే లేదని స్టాలిన్ వ్యాఖ్యానించడం గమనార్హం.


Tags:    

Similar News