అవునా.. సోము పదవికి బాబు అడ్డం పడ్డారా?

Update: 2018-02-05 14:30 GMT
బడ్జెట్ లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు సాధించలేకపోయారు గానీ.. చంద్రబాబునాయుడు భాజపా హైకమాండ్ ను ప్రభావితం చేసి.. ఆ పార్టీ నిర్ణయాలను తన ఇష్టానుసారం నడిపిస్తున్నారా అనే అభిప్రాయం ఇప్పుడు కలుగుతోంది. ఇదేదో ఆషామాషీగా పుకార్లను ఆధారం చేసుకుని పుడుతున్న అనుమానం కాదు. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల్లోనే ఇలాంటి అనుమానాలు పుడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు - మాజీ మంత్రి కూడా అయిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ - సోమవారం నాడు సోము వీర్రాజు పై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ పరిపాలన ట్రేడింగ్ లాగానే ఉన్నది తప్ప రూలింగ్ లాగా లేదంటూ సోము వీర్రాజు దెప్పిపొడవడంపై తెదేపా నాయకులంతా కౌంటర్లు ఇస్తున్నారు.

అందులో భాగంగా మీడియా ముందుకు వచ్చిన డొక్కా మాట్లాడుతూ.. సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారని.. ఆ పదవి రాకపోయే సరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారని, ఇది తగదని హితవు చెబుతున్నారు. ఈ మాటలు వింటోంటే- భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోతే.. తెదేపాకు చెందిన చంద్రబాబునాయుడును ఎందుకు టార్గెట్ చేయాలనేది సామాన్యులకు కలిగే సందేహం. దాల్ మే కుఛ్ కాలా హై అని ఎవరికైనా అనిపిస్తుంది.

నిజానికి సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని సుమారు ఏడాది కాలంగా రాష్ట్రంలో బాగా ప్రచారం నడిచింది. చంద్రబాబునాయుడు నీడలోంచి భాజపాను బయటకు తీసుకువచ్చి.. సొంత అస్తిత్వం ఉండే రాష్ట్రాస్థాయి పార్టీగా బలోపేతం చేయాలంటే.. సోము వీర్రాజు ఒక్కడే సమర్థుడంటూ.. గతంలో అనేక విశ్లేషణలు భాజపాలోనే అంతర్గతంగా సాగాయి. అయితే నేడో రేపు సోము పేరు ప్రకటన వస్తుందని అని పుకార్లు వచ్చిన ప్రతిసారీ ఆగిపోయింది. అప్పట్లో చంద్రబాబునాయుడు అడ్డు పడుతున్నారనే పుకార్లు కూడా వినిపించింది.

తీరా రెండు రోజుల కిందట ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబునే మళ్లీ కొనసాగించేస్తూ భాజపా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన వచ్చేసింది. సోము కలలకు గండిపడిపోయింది. డొక్కా చెప్పినట్లు.. ఆ ఫ్రస్ట్రేషన్ ను సోము వీర్రాజు , చంద్రబాబునాయుడు మీదకు మళ్లిస్తున్నారని అనుకోవాలి. అంటే.. చంద్రబాబే ఆయన పదవికి అడ్డం పడ్డారా అనే సందేహాలని డొక్కా రేకెత్తిస్తున్నారు మరి!
Tags:    

Similar News