హెచ్‌1బీ వీసాల‌పై ట్రంప్ తీపిక‌బురు

Update: 2017-06-21 06:05 GMT
అవ‌కాశాల గ‌నిగా పేరొంది వ‌ల‌స ఉద్యోగుల‌కు కొండంత భ‌రోసాగా నిలిచిన అగ్ర‌రాజ్యం అమెరికాకు అధిప‌తి అయింది మొద‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో క‌ల‌కలం రేకెత్తించిన డొనాల్డ్ ట్రంప్ ఎట్ట‌కేల‌కు త‌న దూకుడు త‌గ్గించుకున్నారు. అమెరికాకు వలస వచ్చే ఉన్నతస్థాయి సాంకేతిక ఉద్యోగులకు సంబంధించి, హెచ్1బీ వీసాల జారీకి సంబంధించి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన కఠిన వైఖరిని కాస్త సడలించుకున్నట్లు సంకేతాలు  ఇచ్చారు. ఉన్నతస్థాయి నైపుణ్యం ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించుకోవటంలో అవాంతరాలు లేకుండా చూస్తానంటూ ఐటీ కంపెనీలకు ట్రంప్ భరోసా ఇచ్చారు.

సిలికాన్‌ వ్యాలీలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ట్రంప్ వైట్‌హౌస్‌లో సమావేశయ్యారు. ఈ సంద‌ర్భంగా హెచ్‌1బీ వీసాలు, తాము ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌లు - ఇత‌ర‌త్రా అంశాల గురించి ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు చ‌ర్చించారు. అనంత‌రం ట్రంప్ మాట్లాడుతూ తాను అమెరికా అభివృద్ధి కోస‌మే నిర్ణ‌యాలు తీసుకున్నాన‌ని తెలిపారు. దేశంలోని యువ‌త‌కు మెరుగైన భ‌విష్య‌త్ క‌ల్పించ‌డం, అమెరికాను తిరిగి శ‌క్తివంతం చేయ‌డం త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. కంపెనీల ఆందోళ‌న‌ను తాను గ‌మ‌నిస్తున్నాన‌ని చెప్పిన ట్రంప్ - హైటెక్ నైపుణ్యం ఉన్న వ్యక్తులను ప్రత్యేక వ్యక్తులుగా పేర్కొంటూ.. మీరు కోరుకునే వ్యక్తులు మీ కంపెనీలకు వచ్చేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ వారంలో అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో ప్ర‌ధాన‌మంత్రి భేటీ కానున్నారు.  ఈ స‌మావేశంలో అమెరికా ప్ర‌భుత్వం హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై చ‌ర్చించనున్నట్టు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News