అందుకే అందలం : రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఏం చేశారంటే...?

Update: 2022-06-22 07:10 GMT
అందలాలు కోసం అర్రులు చాచే వారు చాలా మంది ఉంటారు. కానీ అవి కొద్ది మందిని మాత్రం కోరుకుండానే వరిస్తూంటాయి. అలా  నిన్నటిదాకా జాతీయ స్థాయిలో  పెద్దగా తెలియని ద్రౌపది ముర్ము రేపు దేశానికి ప్రధమ పౌరురాలు అవుతున్నారు.

సువిశాలమైన భారత దేశం అంతా ఆమె రాష్ట్రపతిగా పెట్టే సంతకంతోనే నడుస్తుంది. రాజ్యాంగ రక్షకురాలిగా అయిదేళ్ళ పాటు ఆమె ఈ దేశాన్ని పాలిస్తారు. ఆమె పేరు మీదనే పాలన సాగుతుంది. అంతటి ఉన్నతమైన పదవికి ఎదిగిన  తరువాత ద్రౌపది ముర్ము ఏం చేశారు. అసలు ఆమె  ఎక్కడ ఉన్నారు అన్నది తెలుసుకుంటే చాలా ఆసక్తిగా ఉంటుంది.

అవును ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో తన ఇంటిలో ఉన్నారు. ఆమె ఢిల్లీలో పదవి కోసం వేచి చూసి  అర్రులు చాచలేదు. తన ఊరిలోనే పని యధాప్రకారం ఆమె చేసుకుంటూ అందరిలాగానే టీవీలో వార్తను చూశారు. అయితే ఆమె పేరు పరిశీలనలో ఉందని అందరిలాగానే ఆమెకూ తెలుసు. అయితే మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ తీసుకున్న కీలక నిర్ణయంతో ఆమె దేశానికి కాబోయే రాష్ట్రపతిగా మారారు.

అయినా ఆమె దినచర్య ఏమీ మారలేదు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని రాయ్ రంగ్ పూర్లోని తన ఇంటిలో  ఉన్నారు. ఇక బుధవారం నాడు ఆమె తెల్లవారుతూనే తన ఊరిలోని శివాలయానికి వెళ్ళారు. ఆమె ఆలయ పరిస‌రాలను చీపురు పట్టి మొత్తం శుభ్రం చేశారు. ఆ తరువాతనే ఆ పరమ శివుణ్ణి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆమె ఈ రోజుకీ చూస్తే రాష్ట్ర మంత్రిగా పంచేశారు. గవర్నర్ గా పనిచేశారు. అయినా ఆమె హోదాలను ఎపుడూ పట్టించుకోలేదు. తన నిరాడంబరత్వాన్ని అలా చాటుకుంటూనే ఉన్నారు. ఇపుడు ఆమెకు ఈ పదవి రావడంతోనే ఫోన్ లో అభినందనలు  వెల్లువెత్తాయి. అంతే కాదు జెడ్ ప్లస్ భద్రత ఆమెకు వెంటనే లభించింది. ఇక తమ రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ముని ఎంపిక చేయడం పట్ల ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ సముచితమైన నిర్ణయం తీసుకుంది అని కొనియాడారు.

మరో వైపు చూస్తే ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో ఎన్డీయేకు ఈ రోజుకు 58  శాతం పైగా ఓట్లు ఉన్నందువల్ల ద్రౌపది ముర్ము విజయం అతి సునాయాసం అని అంటున్నారు. మొత్తానికి ఆమె అందలం కోరుకోలేదు. అదే ఆమె కోసం అలా దిగి వచ్చింది. ఇలాంటి వారే కదా దేశానికి కావల్సింది అని  అనుకునేలా ఆమె మరింతగా తన ప్రతిభను చాటుకుంటారని అంతా ఆశిస్తున్నారు.
Tags:    

Similar News