అదే జరిగితే కాంగ్రెస్ కు చిగురులు తొడిగినట్టే?

Update: 2019-10-24 01:30 GMT
హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఇండియాటుడే ఇచ్చిన పోస్ట్ పోల్ సర్వే అత్యంత ఆసక్తిదాయకంగా మారింది. హర్యానాలో హంగ్ తరహా పరిస్థితి ఏర్పడవచ్చని ఈ సర్వే చెబుతూ ఉంది. మొత్తం తొంభై సీట్లున్న హర్యానా అసెంబ్లీకి రెండ్రోజుల  కిందట పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఇండియాటుడే ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వే  ఆసక్తిదాయకంగా మారింది.

ఈ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం.. హర్యానాలో ఏ పార్టీకీ అంత తేలికగా అధికారం అందదు.భారతీయ జనతా పార్టీకి ముప్పై నుంచి నలభై రెండు సీట్లు - కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుంచి నలభై సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని ఇండియాటుడే అంటోంది. మరో పది సీట్ల వరకూ స్థానిక పార్టీకి దక్కవచ్చని అంటోంది!

కాంగ్రెస్ పతనం ప్రారంభం అయినది హర్యానా నుంచినే అని ఒక రకంగా చెప్పవచ్చు. అక్కడ గత పర్యాయం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్  కేవలం పది సీట్లకు పరిమితం అయ్యింది. ఆ తర్వాత  గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా కొందరు ఫిరాయించారు.  అలాంటిచోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నలభై వరకూ అసెంబ్లీ సీట్లను సంపాదించుకున్నా, అన్నీ కలిసి వచ్చి ప్రాంతీయ పార్టీతో పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది సంచలనమే అవుతుంది.

అయితే కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం కాంగ్రెస్ కు అంత సీన్ లేదని అంటున్నాయి. అక్కడ బీజేపీ పూర్తి మెజారిటీతో మళ్లీ పవర్ సంపాదించుకుంటుందని అవి అంచనా వేస్తున్నాయి. కానీ ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు  నిజాలు అయ్యాయి. హర్యానా విషయంలో ఏం జరగనుందో మరి కొన్ని గంటల్లో తెలిసిపోయే అవకాశాలున్నాయి!
Tags:    

Similar News