బీఆర్ఎస్ స‌భ‌పై అంచ‌నాలు పెరిగిపోతున్నాయే!!

Update: 2023-01-18 00:30 GMT
భార‌త రాష్ట్ర‌స‌మితిగా ఆవిర్భ‌వించిన టీఆర్ ఎస్‌.. తొలి స‌మావేశం బుధ‌వారం ఖ‌మ్మంలో జ‌ర‌గ‌నుంది. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాధికంగా భావిస్తున్నారు. వాస్త‌వానికి  తొలి స‌భ‌ను ఏపీలో కానీ, మ‌హారాష్ట్ర‌లో కానీ పెడ‌తార‌ని అనుకున్నారు.

అయితే.. అనూహ్యంగా ఆయ‌న ఖ‌మ్మం ఎంచుకున్నారు. ఇది ఏపీ స‌హా ఇత‌ర రాష్ట్రాల‌కు సంబంధించిన వ్యాపారుల‌కు, కూడ‌లి ప్రాంతంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ స‌భ‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది.

దీనికి తోడు.. ప‌లువురు ముఖ్య‌మంత్రులు కూడా ఈ స‌భ‌కు వ‌స్తున్నార‌నే స‌మాచారం ఇప్ప‌టికే పార్టీకి అందింది. దీంతో ఈ స‌భ‌కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌డుతున్నారు. దాదాపు 5 ల‌క్ష‌ల మందిని తీసుకువ‌చ్చేలా.. ఆరేడు ల‌క్ష‌ల మంది అంచ‌నాతో ఈ స‌భ‌ను ప్లాన్ చేశారు. భోజ‌నాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు.. అస‌లు ఈ స‌భ ద్వారా.. కేసీఆర్ త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌ట‌కు తెస్తార‌ని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాని అభ్య‌ర్థిపై నా అభ్య‌ర్థిత్వంపైనా కేసీఆర్ మౌనంగా నే ఉన్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఆయ‌న అంచ‌నా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ స‌భ ద్వారా.. మోడీపై స‌హ‌జంగానే చేసే విమ‌ర్శ‌ల‌కు తోడు.. ప్ర‌ధాని అభ్య‌ర్థిగా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌ని అంటున్నారు. త‌ద్వారా.. వ‌చ్చే రాష్ట్ర ఎన్నిక‌లకు కూడా మార్గం సుగ‌మం చేసుకుంటార‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. బీఆర్ ఎస్‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెరుగుతాయ‌ని అంటున్నారు.

ఇక‌, ఏపీలో మ‌రింత మంది నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోనే వ్యూహాన్ని కేసీఆర్ సిద్ధం చేస్తున్నార‌ని తెలు స్తోంది. ఈ స‌భ‌ను త‌న ప్ర‌భావాన్ని తెలిసేలా.. త‌న దూకుడు పెంచేలా ప్లాన్ చేశార‌నేది మ‌రో వాద‌న‌. ఎలా చూసుకున్నా.. అటు క‌ర్ణాట‌క‌, ఇటు ఏపీలే కాకుండా.. మ‌హారాష్ట్ర‌పైనా కేసీఆర్ క‌న్నేసిన నేప‌థ్యంలో బీఆర్ ఎస్ స‌భ‌కు ప్రాధాన్యం పెరిగింది.

జాతీయ అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంతోపాటు.. న‌దీ జ‌లాల అనుసంధానం వంటి కీల‌క అంశాల‌కు కూడా కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News