వారికీ ఒక అందముంది..దానికీ ఓ పోటీ ఉంది..!

Update: 2015-11-10 04:14 GMT
అమ్మాయిల్లో అందగత్తెలను నిగ్గుతేల్చి వారికి సినిమా హీరోయిన్లుగాను, యాడ్స్‌ మోడల్స్‌ గాను అవకాశాలు కల్పించడానికి అందాల పోటీలు బోలెడు ఉన్నాయి. అదే తరహాలో.. కండలు తిరిగిన మొగాళ్లను పుటం వేసి.. మిస్టర్‌ ఇండియా లాంటి బిరుదులు ఇవ్వడానికి కూడా పోటీలు అనేకం ఉన్నాయి. మరీ అటూ ఇటూ కాని వారి అందం సంగతేమిటి? 'మాకూ ఒక ఆత్మ ఉంది.. దానికీ ఓ కథేడ్చింది' అంటూ బ్రహ్మానందం చెప్పినట్లుగా లింగమార్పిడి చేయించుకున్న వారికి (ట్రాన్స్‌ జెండర్‌ లకు) కూడా ఒక అందముంటుంది. ఆ అందాన్ని గుర్తించి, వారికి ఆత్మవిశ్వాసం కలిగించడం కోసం థాయిల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ లో అందాల పోటీలు జరిగాయి. ఫిలిప్పీన్స్‌ కు చెందిన ట్రిక్సీ మేరిస్టెలా.. మిస్‌ ఇంటర్నేషనల్‌ క్వీన్‌ 2015గా కిరీటాన్ని దక్కించుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ లకు ప్రపంచంలో జరిగే అతిపెద్ద అందాలపోటీ విజేతగా నిలిచింది.

మన భాషలో చెప్పాలంటే ఈ హిజ్రాల అందాల పోటీలో.. వివిధ ప్రపంచ దేశాల నుంచి మొత్తం 26 మంది పోటీదారులు పాల్గొన్నారు. వీరిలో 29 ఏళ్ల ఫిలిప్పీన్స్‌ అందగత్తె (గాడు అనాలా? వారు అలాగే చెప్పుకుంటున్నారు మరి!) మేరి స్టెల్లా వారందరినీ ఓడించి.. కిరీటం తన సొంతం చేసుకుంది. రెండు మూడు స్థానాల్లో బ్రెజిల్‌ - థాయిల్యాండ్‌ కు చెందిన ట్రాన్స్‌జెండర్‌ లు నిలిచారు.

థాయిల్యాండ్‌ లో లింగపరమైన స్వేచ్ఛ చాలా ఉంటుంది. వారికి ఎలాంటి కట్టడి ఉండదు. ఆ దేశంలోని ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఇండస్ట్రీలో ట్రాన్స్‌జెండర్‌ లు చాలా మందే పనిచేస్తూ ఉంటారు.

అందుకే కాబోలు ఈ పోటీలో పాల్గొన్న జపాన్‌ హిజ్రా రియో మిజునో మాట్లాడుతూ.. జపాన్‌ లాగా కాకుండా.. ఈ దేశాల్లో చాలా స్వేచ్ఛ ఉన్నదంటూ మురిసిపోయింది. హిజ్రాలు అంటే ఏదో జోకులు వేసుకోవడానికి పనికొచ్చే సరుకు కాదని.. తమను కూడా సమాజం ప్రత్యేకంగా గుర్తించాలని వారు కోరుతున్నారు.
Tags:    

Similar News