అర్థసత్యాలతో ముంచాలని చూస్తున్నారా?

Update: 2018-01-09 11:04 GMT
ఒక వ్యవహారం నడుస్తున్నప్పుడు.. అందులో సవాలక్ష లోపాలు దొర్లుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పుడు.. సహజంగానే విమర్శలు వస్తుంటాయి. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు.. అన్యాయాన్ని అక్రమాల్ని సహించలేని వారు కూడా విమర్శలు చేస్తుంటారు. అయితే వాటిని ఎదుర్కొనే వారు మాత్రం.. అసలు విమర్శల జోలికి వెళ్లకుండా.. అర్థ సత్యాలు మాట్లాడుతూ.. తామేదో సచ్చీలురం అని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. హెచ్‌ సీఏలో ఎడాపెడా అక్రమాలు జరిగిపోతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో.. అసలు తాము ఎలాంటి తప్పులూ చేయడం లేదని.. కడిగిన ముత్యాల్లా హెచ్ సీఎ ను నడిపిస్తున్నాం.. అని సారథులు చెప్పుకుంటున్నారు.

హెచ్‌ సీఏకు ప్రస్తుతం మాజీ ఎంపీ వివేక్ అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే హెచ్ సీఎ లో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఒకప్పుడు వివేక్ కు అత్యంత సన్నిహితుడిగానే మెలగని అసోసియేషన్ కార్యదర్శి శేషుని సస్పెండ్ చేయడం.. ఇప్పుడు కొత్త వివాదంగా మారింది.

మరోవైపు రెండు రోజుల కిందట సమావేశానికి అజారుద్దీన్ వచ్చినప్పుడు.. ఆయనను అనుమతించకుండా అవమానించడం మరో వివాదంగా మారింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ వీ హనుమంతరావు బీభత్సంగా వివేక్ పై విరుచుకుపడ్డారు కూడా. ఇదేమీ తెరాస మీటింగ్ కాదు.. అజార్ ను అవమానించి.. హెచ్ సీఎ మీటింగ్ జరుపుతారా? అంటూ రెచ్చిపోయారు. ఆ వివాదాల పుట్టలోంచి.. అసలు హెచ్ సీఎలో జరుగుతున్న అక్రమాలపై అనేక ఆరోపణలొచ్చాయి. కోట్లకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు నామినేషన్ పద్ధతిలోనే కట్టబెట్టేస్తున్నారని.. బీసీసీఐ నుంచి వస్తున్న కోట్ల రూపాయలను యథేచ్ఛగా తినేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి.

వాటిపై వివేక్ కౌంటర్ లు కూడా ఇస్తున్నారు. అయితే ఆయన స్వాహాల గురించి మాట్లాడకుండా.. బీసీసీఐ నుంచి తమకు ఒక్క రూపాయి కూడా రాలేదు అనే సంగతి మాత్రమే చెబుతున్నారు.  డబ్బు బీసీసీఐ నుంచి వచ్చిందా.. విరాళాల ద్వారా వచ్చిందా.. ఐపీఎల్ ద్వారా వచ్చిందా అనేది అనవసరం.. నామినేషన్ మీద పనులు ఇస్తున్నారా.. విచ్చలవిడితనం ఉందా లేదా? అనేవి అసలు ఆరోపణలు..! తాను చాలా లౌక్యంగా వాటినించి ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తున్నట్లు వివేక్ అనుకోవచ్చు గానీ.. వారు ప్రతి చిన్న విషయాన్నీ గమనిస్తుంటారని ఆయన తెలుసుకోవాలి.

Tags:    

Similar News