ఇంటి పేరులో గాంధీ లేకుంటే.. అలా జ‌రిగేది

Update: 2017-11-12 05:49 GMT
మాట‌ల‌తో మంట పుట్టించే నేత వ‌రుణ్ గాంధీ. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు త‌న మాట‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచేవారు. త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే తీరుకు భిన్నంగా ఆయ‌న కొద్దికాలంగా మౌనంగాఉంటున్నారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఎంపీల‌కు మంట పుట్టేలా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న ఇంటి పేరులో గాంధీ అన్న‌దే లేకుండా తాను 29 ఏళ్ల‌కే ఎంపీని అయ్యేవాడిన‌ని చెప్పారు. గువాహ‌టిలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వ‌రుణ్ గాంధీ .. త‌న వ్య‌క్తిగ‌త విష‌యాన్ని వెల్ల‌డించారు. త‌న ఇంటి పేరులో కానీ గాంధీ అన్న‌ది లేకుంటే తానిప్పుడు ఎక్క‌డ ఉండేవాడినో అంద‌రికి తెలుస‌న్నారు.

ఇంటిపేరు ప్ర‌తిష్ఠ‌లు ముఖ్యం కాద‌న్న వ‌రుణ్‌.. ప్ర‌జ‌ల‌కు స‌మాన‌హ‌క్కులు ల‌భించాల‌న్న‌దే త‌నకు ముఖ్య‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నో కొత్త ప్ర‌తిపాద‌న తెర మీద‌కు తీసుకొచ్చారు.  ఎన్నిక‌ల వేళ నేత‌లు తామిచ్చే హామీల‌కు వారిని బాధ్యుల్ని చేయాల‌న్నారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌కుంటే వారిని తొల‌గించే హ‌క్కు ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న తెర మీద‌కు తెచ్చారు. బ్రిట‌న్ లో ప్ర‌జ‌ల నుంచి ల‌క్ష ఓట్ల సంత‌కాల్ని సేక‌రిస్తే ప్ర‌జాప్ర‌తినిధుల‌ను తొల‌గించే అంశంపై పార్ల‌మెంటులో చ‌ర్చ చేస్తార‌ని.. అలాంటి ప‌రిస్థితి దేశంలోనూ రావాల‌న్న అభిలాష‌ను వ్య‌క్తం చేశారు.

చ‌ట్ట‌స‌భ‌ల ప‌ద‌వులు చేప‌ట్టిన రెండేళ్ల వ్య‌వ‌ధిలో తాము ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌ని ఎంపీల‌ను రీకాల్ చేసే అవ‌కాశ‌మే ఉంటే.. 75 శాతం ఎంపీలను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.  అవ‌స‌ర‌మైతే 1951 ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టాన్ని ప్రైవేటు బిల్లు ద్వారా స‌వ‌రించాల‌న్న సూచ‌న‌ను వ‌రుణ్ గాంధీ చేశారు.  

దేశ రాజ‌ధానిలో తమిళ‌నాడు రైతులు త‌మ స‌మ‌స్య‌ల మీద ఆందోళ‌న చేస్తుంటే చ‌ట్ట‌స‌భ‌ల్లో చ‌ర్చ జ‌ర‌గ‌లేదన్నారు. అదే స‌మ‌యంలో త‌మ జీతాలు పెంచుకునే విష‌యం మీద ప్ర‌జాప్ర‌తినిధులు చ‌ట్ట‌స‌భ‌లో ఒక రోజంతా కూర్చొని చ‌ర్చించారంటూ త‌ప్పు ప‌ట్టారు. ఏ రంగంలోనూ సామాన్యుల‌కు అవ‌కాశాలు ద‌క్క‌ని ప‌రిస్థితి ఉంద‌న్నారు. క్రికెట్‌.. వ్యాపారం.. సినిమాలు.. ఇలా ఏ రంగంలోనూ సామాన్యుల‌కు అవ‌కాశాలు ల‌భించ‌టం లేద‌న్నారు. ప‌ని తీరు బాగోని ఎంపీల‌ను రీకాల్ చేసే అంశంపై వ‌రుణ్‌ గాంధీ వ్యాఖ్య‌లు ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కొత్త గుబులు పుట్టిస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News