కేసీఆర్ తీరును ఉతికి ఆరేసిన జ‌గ‌న్ పార్టీ!

Update: 2018-08-03 04:37 GMT
తెలంగాణ అధికార ప‌క్షం చేస్తున్న త‌ప్పుల చిట్టాను విప్పింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత‌లు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల‌కు భిన్నంగా ఉన్న ప‌రిస్థితుల‌పై మండిప‌డింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు.. నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాల్లో అన్యాయం జ‌రుగుతుంద‌ని గ‌ళం విప్పిన ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటూ ప్ర‌శ్నించారు. కోట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీలో ఐదు ఉద్యోగాలు వ‌చ్చాయే కానీ.. విద్యార్థులు..నిరుద్యోగుల ఆశ‌లు ఆవిరి అయిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాల్ని వెంట‌నే భ‌ర్తీ చేయాల‌న్న డిమాండ్‌ తో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాయి. అనంత‌రం వారు క‌లెక్ట‌ర్ ను క‌లిసి విన‌తిప‌త్రాన్ని అందించారు.

నీళ్లు.. నిధులు.. నియామ‌కాల నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం జ‌రిగింద‌ని.. ఆ మూడు నినాదాల‌తోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జ‌రిగింద‌ని.. కానీ.. కేసీఆర్ స‌ర్కారు పుణ్య‌మా అని కాంట్రాక్ట‌ర్ల జేబులు నింప‌టానికి.. క‌మీష‌న్ల క‌క్కుర్తి కోసం కాళేశ్వ‌రం.. పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు వేల కోట్లు ఖ‌ర్చు చేసిన వైనాన్ని ప్ర‌స్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. హైద‌రాబాద్‌ లో జ‌రిగిన ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ గ‌ట్టు శ్రీ‌కాంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

టీఎస్ పీఎస్సీ చేసిన త‌ప్పిదాల‌తో నిరుద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నార‌ని.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం అధికార మ‌త్తులో జోగుతున్న‌ట్లుగా త‌ప్పు ప‌ట్టారు. టీఎస్ పీఎస్సీ నిర్దిష్ట‌మైన నియ‌మ నిబంధ‌న‌లు లేక‌పోవ‌టంతో 2016 న‌వంబ‌రులో నిర్వ‌హించిన గ్రూపు2 ప‌రీక్ష‌లు.. 2017లో నిర్వ‌హించిన గురుకుల ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల చేయ‌లేద‌న్నారు. కేసీఆర్ స‌ర్కారు ఏర్ప‌డి నాలుగేళ్లు పూర్తి అయినా కేవ‌లం 12వేల ఉద్యోగాల్ని మాత్ర‌మే భ‌ర్తీ చేసింద‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వ వైఖ‌రిలో మార్పు రాక‌పోతే ద‌శ‌ల వారీగా త‌మ పోరాటాన్ని ఉధృతం చేస్తామ‌న్నారు. పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి హెచ్ ఏ ర‌హ‌మాన్ మాట్లాడుతూ నిరుద్యోగుల్ని నిర్ల‌క్ష్యం చేస్తే 2019 ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ది చెబుతామ‌న్నారు. కేసీఆర్ స‌ర్కారు తీరుపై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన‌ వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.
Tags:    

Similar News