గ్లోబ‌రీనాపై చ‌ర్య‌లు!... ఊస్టింగ్ తో స‌రి!

Update: 2019-05-11 10:47 GMT
తెలంగాణ ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ లో చోటుచేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల కార‌ణంగా ఏకంగా 23 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. రోజుల త‌ర‌బబి ఇంట‌ర్ బోర్డు వ‌ద్ద యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ ఉద్రిక్త‌త‌లు ఇంట‌ర్ బోర్డు ఉన్న నాంప‌ల్లి నుంచి బేగంటేట‌లోని సీఎం క్యాంపు కార్యాల‌యం దాకా పాకిన వైనం కూడా తెలిసిందే. ఇప్ప‌టికీ పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల్లోని ఆగ్రహావేశాలు త‌గ్గ‌లేదు. ఇక బోర్డు త‌ప్పిదం వ‌ల్ల చ‌నిపోయిన పిల్ల‌ల ఫ్యామిలీల‌కు ఇప్ప‌టిదాకా ప‌రిహారం మాటే వినిపించ‌లేదు. త‌ప్పులు చేసిన వారికి శిక్ష‌లు విధించాల్సిందేన‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో కాస్తంత ఆల‌స్య‌మైనా తెలంగాణ స‌ర్కారు దిద్దుబాటు చ‌ర్య‌ల‌తో పాటు శిక్ష‌ల అమ‌లును కూడా షురూ చేసిందని చెప్పాది.

దిద్దుబాటు చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్రారంభ‌మైపోగా... శ‌నివారం చ‌ర్య‌ల దిశ‌గా కీల‌క నిర్ణ‌యాలు వెలువ‌డ్డాయి. ఇంట‌ర్ విద్యాబోధ‌న‌, షెడ్యూల్ రూప‌క‌ల్ప‌న‌, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, వాల్యూయేష‌న్‌, ఫ‌లితాల ప్ర‌క‌ట‌న మొత్తం ఇంట‌ర్ బోర్డు బాధ్య‌తే అయినా... ఈ సారి త‌ప్పులు దొర్ల‌డానికి మాత్రం గ్లోబ‌రీనా సంస్థ‌నే. ఇంట‌ర్ బోర్డు పెరిగిన ప‌నిని కాంట్రాక్టు సంస్థ‌లకు అప్ప‌జెబుతోన్న క్ర‌మంలో గ‌తేడాది గ్లోబ‌రీనా ఆ కాంట్రాక్టును ద‌క్కించుకుంది. అయితే ఆ సంస్థ‌కు అనుభ‌వ లేమి, నిర్ల‌క్ష్య ధోర‌ణితో విద్యార్థుల‌కు శాపంగా మారిపోయింది. ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌కు ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను ఆ సంస్థ ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. వెర‌సి వేలాది మంది విద్యార్థుల మార్కులు త‌ల‌త‌కిందులైపోయాయి. పాసైన వారు ఫెయిల్ అయితే... ఫెయిల్ అయిన వారు పాసైపోయారు. పాస‌వుతామ‌ని గ‌ట్టిగా న‌మ్మకం పెట్టుకున్న వారు ఫెయిల్ అయిన‌ట్టు తేల‌డంతో బ‌ల‌వ‌న్మ‌రణాల‌కు పాల్ప‌డ్డారు. ఈ విష‌యంలో త‌ప్పు జ‌రిగిన మాట వాస్త‌వ‌మేనంటూ ఇంట‌ర్ బోర్డు అంగీక‌రించింది. అంకాకుండా గ్లోబ‌రీనాదే బాధ్యత అంటూ కూడా తేల్చి చెప్పింది.

దీనిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డ తెలంగాణ సర్కారు... ఇంట‌ర్ బోర్డు కాంట్రాక్టు నుంచి గ్లోబ‌రీనాను త‌ప్పించేసింది. అంతేకాకుండా మ‌ళ్లీ కొత్త‌గా పిలిచిన టెండ‌ర్ల‌లో ఆ సంస్థ పాలుపంచుకోకుండా ఉండేలా ఓ క‌ఠిన నిబంధ‌న‌ను కూడా పెట్టేసింది. గ‌డ‌చిన రెండేళ్ల‌లో ఇంట‌ర్ బోర్డు కాంటట్రాక్టు ద‌క్కించుకోని సంస్థ‌లు మాత్ర‌మే బిడ్ల‌ను దాఖ‌లు చేయాలంటూ ఓ కండీష‌న్ పెట్టేసింది. మొత్తంగా త‌ప్పు చేసిన గ్లోబ‌రీనాపై చ‌ర్య‌లు తీసుకున్నార‌న్న మాట‌. ఇదిలా ఉంటే... 23 మంది విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన గ్లోబ‌రీనాపై కేవ‌లం ఊస్టింగ్ ఆర్డ‌ర్ తో స‌రిపెట్టేస్తారా? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్నాయి. విద్యార్థుల జీవితాల‌తో ఆట‌లాడుకున్ గ్లోబ‌రీనా యాజ‌మాన్యాన్ని అరెస్ట్ చేయాల‌న్న డిమాండ్లు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్నాయి.

    
    
    

Tags:    

Similar News