వైఎస్‌తో అనుబంధ‌మే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌రించింది

Update: 2022-04-12 04:44 GMT
దివంగ‌త వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడైన విశ్వరూప్‌ నాలుగోసారి మంత్రి అయ్యారు.  2009లో వైఎస్‌ కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా నియమితులైన విశ్వరూప్‌ వైఎస్‌ మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో కూడా కొనసాగారు. మంత్రిగా పదవీ కాలం ఆరు నెలలుండగానే వైఎస్‌తో ఉన్న అనుబంధంతో పదవిని విడిచిపెట్టి జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి కోనసీమలో ఎస్సీ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించి సమర్థత కలిగిన నేతగా నిలిచారు.

ఈ నేపథ్యంలోనే తొలి కేబినెట్‌లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్‌లోకి కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తీసుకున్నారు. విశ్వరూప్‌ను కేబినెట్‌లో కొనసాగించడం ద్వారా కోనసీమ జిల్లాలో బలమైన సామాజికవర్గాల పరంగా మంచి ముద్ర వేస్తారని నేతలు విశ్లేషిస్తున్నారు. విశ్వరూప్‌ వివాదరహితుడిగా ఉండడం రెండోసారి మంత్రి పదవి దక్కడానికి ఒక కారణమైంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన విశ్వ‌రూప్ ప్ర‌స్తుతం ఉన్న కేబినెట్‌లో అత్యంత సీనియ‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఆరుసార్లు మంత్రి ప‌ద‌విని అలంక‌రించారు.

వివాద ర‌హితుడుగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అన్ని సంద‌ర్భాల్లోనూ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అధినేత మ‌నసెర‌గిన నాయ‌కుల్లో విశ్వ‌రూప్ ప్ర‌దాన పాత్ర పోషించారు. అందుకే ఆయ‌న‌కు అనతి కాలంలోనే గుర్తింపు ల‌భించింది. లాబీయింగులు చేయ‌డం.. అల‌క పూన‌డం వంటివి విశ్వ‌రూప్ చ‌రిత్ర‌లోనే లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

1987లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన విశ్వ‌రూప్‌.. 1998లో తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం ఉప ఎన్నిక‌ల్లో త‌ర్వాత 1999లో సాధార‌ణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. 2004లో వైఎస్ వ‌ర్గ నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు.

ఈ క్ర‌మంలో ఆ ఏడాదిజ‌రిగిన ముమ్మ‌డి వ‌రం ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గం పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత‌.. 2009లో ఏర్ప‌డిన అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

వైఎస్‌, కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాల్లో మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2013లో వైసీపీలో చేరిన ఆయ‌న 2014లో అమ‌లాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. త‌ర్వాత‌.. 2019లో అమ‌లాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు.
Tags:    

Similar News