ఏపీ సలహాదారులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Update: 2021-07-24 03:36 GMT
ఏపీ ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రి సలహాదారుల విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల పేరుతో 40-50 మందిని నియమించటం ఏమిటని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం.. పలుకీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ తీసుకున్న నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కేసు నమోదు కావటం తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ జరిగింది. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పటికే జరిగింది. తాజాగా మరోసారి సాగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది శశిభూషనర్ రావు వాదనలు వినిపిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంతరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నియమిస్తున్న ఏపీ సలహదారుల ఉదంతం చర్చకు వచ్చింది. ఎన్నికల సంఘ కమిషనర్ గా నీలం సాహ్నిని నియమించిన వైనం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్దమని పేర్కొన్నారు. ఓటరుగా.. దేశ పౌరునిగా సదురు నియామకాన్ని ప్రశ్నించే హక్కు పిటిషనర్ కు ఉందని.. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం వాటిల్లకున్నప్పటికీ సదరు నియామకాన్ని ప్రశ్నించే హక్కు పిటిషనర్ కు ఉందని న్యాయవాది వాదించారు.

నీలం సాహ్ని ఏపీ సీఎస్ గా పని చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని రెండుసార్లు పొడిగించిందని.. పదవీ విరమణ చేసిన తర్వాత ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఆమె సేవలు అందించారని.. అలాంటప్పుడు గవర్నర్ కు పంపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విష్ లిస్టులో నీలం సాహ్ని ఉందన్నారు. చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు స్వతంత్ర వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించినట్లు భావించలేమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ తన వాదనలు వినిపించారు. పాలనలో నిపుణులైన వారిని ఎన్నికల కమిషనర్ గా ఉండాలన్న ఉద్దేశంతో గవర్నర్ కు ముఖ్యమంత్రి పేర్లు పంపారన్నారు. అయితే.. ఆ పేర్లను గవర్నర్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నీలం సాహ్ని నియమకానికి ముందు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నందున ఆమె స్వతంత్రంగా వ్యవహరించదని పిటిషననర్ వాదించటం సరికాదని.. అంతా నిబంధనల ప్రకారమే సాగినట్లుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారులపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది. ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

- సలహాదారుల అర్హత, నియామకం విషయంలో నిబంధనలు ఏమైనా ఉన్నాయా?

- సలహాదారుల నియామక జీవోలో వారి విధులు ఉన్నాయి. అర్హత గురించి ఎలాంటి నిబంధనలు లేవు. ప్రభుత్వ ఖజానా నుంచే వారికి జీతం, అలవెన్స్‌లు చెల్లిస్తారంటూ ఏపీ చెప్పగా అందుకు హైకోర్టు స్పందిస్తూ.. నలభై.. యాభై మందిని సలహాదారులను
నియమించుకునేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూడాలి కదా?

- గతంలో సలహాదారులు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువని...ప్రసుత్తం కొంతమంది మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారు.

- మాజీ ముఖ్యమంత్రి వైఎ్‌సకు సలహాదారుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు... రాజశేఖరెడ్డి మరణించిన తరువాత ప్రజలకు ధైర్యం చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చారు.
Tags:    

Similar News