స‌భ పెట్టుకోండి.. కానీ.. అలా చేయొద్దు: బండికి హైకోర్టు ఆదేశం

Update: 2022-08-26 14:53 GMT
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బీజేపీ నేతలు ఉన్నత న్యాయస్థానంలో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. శ‌నివారం నిర్వ‌హించ‌నున్న సభకు అనుమతిచ్చింది. అయితే.. సభలో నేతలు ఎవ‌రూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని బీజేపీని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఎవ‌రైనా రెచ్చ‌గొట్టిన‌ట్టు.. లేదా రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసిన‌ట్టు రుజువులు ఉంటే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా శ‌నివారం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో భాజపా భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అయితే ఈ సభకు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. సభకు పోలీసుల అనుమతి లేదని తెలిపింది. పోలీసుల పర్మిషన్‌ లేనందున తాము అనుమతించలేమని వివరించింది.

అయితే ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడంతో వాయిదా పడిన ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న బీజేపీ శ్రేణులు అనుమతి నిరాకరణపై మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సభకు పర్మిషన్ ఇచ్చింది. సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని ఆదేశించింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ నియ‌మాన్ని పాటించితీరాల‌ని పేర్కొంది.

మ‌రోవైపు వ‌రంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌-30 ప్రకారం బహిరంగ సభలు, సమావేశాలు ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నేటి నుంచి 31 ఉదయం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags:    

Similar News