హైద‌రాబాద్ పోలీసుల‌కు అసలేమైంది..?

Update: 2015-11-10 15:58 GMT
ఈ న‌గ‌రానికి ఏమైంది? అంటూ ప్ర‌శ్నించే ప్ర‌శ్న లాంటిదే.. ఇప్పుడు హైద‌రాబాద్ పోలీసుల‌కు ఏమైంద‌ని ప్ర‌శ్నించాల్సిన ప‌రిస్థితి. ఆడోళ్ల జోలికి వ‌స్తే క‌ళ్లు పీకేస్తాన‌న్న రేంజ్‌లో ఆ మ‌ధ్య‌న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న మాట సంగ‌తి ఏమో కానీ.. ఆడోళ్ల మెడల్లో నుంచి ఇష్టారాజ్యంగా గొలుసులు లాక్కెళ్లుతున్న ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌రంటే ఒక్క అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న‌ది లేదు.

మొన్నామ‌ధ్య  ఆటోన‌గ‌ర్ లో చైన్‌ స్నాచింగ్ దొంగ‌ల్ని ప‌ట్టుకునే క్ర‌మంలో తుపాకీతో కాల్పులు జ‌ర‌ప‌టం.. అయినా దొంగ‌లు దొర‌క్క‌పోవ‌టం తెలిసిందే. సీసీ కెమేరాల‌కు చిక్కుతున్న దొంగ‌ల ఆన‌వాళ్లు పోలీసుల‌కు మాత్రం దొర‌క‌టం లేదు. న‌గ‌రంలో ఎన్నో ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నా.. పోలీసులు మాత్రం ఎవ‌రినీ ఇప్ప‌టివ‌ర‌కూ అదుపులోకి తీసుకోని ప‌రిస్థితి. కాక‌పోతే.. ఆ మ‌ధ్య‌న సీవీ ఆనంద్ అనే పోలీసు పెద్దాయ‌న నేతృత్వంలో కొంత‌మంది పోలీసు పోర‌గాళ్లు బైకుల్ని చిత్రవిచిత్ర విన్యాసాలు చేసి.. వాటిని టీవీ చాన‌ళ్ల వారు షూటింగ్ చేసేలా చేసి.. ఛాన‌ళ్ల‌లో కాసేపు హ‌డావుడి చేశారు. స్నాచింగ్ దొంగ‌ల అంతు చూసేందుకు తాము స‌న్న‌ద్ధంగా ఉన్నామ‌ని చెప్పి హీరోల మాదిరిగా చాలానే మాట‌లు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. తాజాగా స్నాచ‌ర్లు మ‌రింత రెచ్చిపోయారు. మంగ‌ళ‌వారం సికింద్రాబాద్ లోని కంచ‌న్ బాగ్ సాయిబాబా గుడి ప్రాంతంలో ఆసుప‌త్రికి తండ్రితో స్కూటీ మీద వెళుతున్న మ‌హిళ మెడ‌లో నుంచి బంగారు గొలుసును తెంచుకెళ్లారు. తండ్రితో స్కూటీ మీద వెళుతున్న మ‌హిళ కాలు స‌రిగా లేక‌పోవ‌టంతో వాహ‌నాన్ని స్లోగా వెళుతున్నారు. దీన్ని ల‌క్ష్యంగా చేసుకొని దొంగ‌లు.. ప‌ల్స‌ర్ మీద వ‌చ్చి మ‌హిళ మెడ నుంచి గొలుసు తెంచుకుపోవ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. 

ఊహించ‌ని ప‌రిణామంతో ఆ మ‌హిళ బ్యాలెన్స్ త‌ప్పి స్కూటీ మీద నుంచి ప‌డిపోయింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను ఆసుప‌త్రికి త‌రలించారు. అదృష్ట‌వ‌శాత్తు ఆమె కింద ప‌డిన స‌మ‌యంలో వెనుక నుంచి పెద్ద వాహ‌నం ఏదీ రాలేదు కాబ‌ట్టి స‌రిపోయింది. ఒక‌వేళ ఏదైనా భారీ వాహ‌నం వ‌చ్చి ఉంటే.. ఆలోచించ‌టానికి కూడా భ‌యం వేసే ప‌రిస్థితి. 
ఇంత‌కాలం రోడ్ల మీద న‌డిచి వెళ్లే మ‌హిళ‌ల్ని మాత్ర‌మే టార్గెట్ చేసిన స్నాచ‌ర్లు.. తాజాగా వాహ‌నాల మీద వెళుతున్న మ‌హిళ‌ల్ని టార్గెట్ చేయ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. య‌థావిధిగా.. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేస్తున్నారు. జ‌రిగిన దారుణ ఘ‌ట‌న సీసీ కెమేరాలతో న‌మోదు కావ‌టంతో ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది. సీసీ కెమేరాల్లో రికార్డు అయిన ఈ మొత్తం ఘ‌ట‌న‌ను చూసినప్పుడు.. అప్ర‌య‌త్నంగా ఈ హైద‌రాబాద్ పోలీసుల‌కు అస‌లేమైంద‌న్న మాట మ‌న‌సులోకి రాక మాన‌దు.
Tags:    

Similar News