గుడ్ న్యూస్ః4 ల‌క్ష‌ల దాకా ఐటీ లేదు

Update: 2017-01-24 05:54 GMT
ఫిబ్ర‌వ‌రీ 1 తేదీన కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న నేప‌థ్యంలో జ‌నంలో ఆశ‌లు పెరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర సాధారణ బడ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెడుతూ అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏ రక‌మైన తాయిలాలు అందించనున్నారన్న దానిపై మధ్యతరగతి వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరితోపాటు ఇతర వర్గాల ఆకాంక్షలనూ తీర్చే విధంగానే కొత్త 2017 బడ్జెట్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకూ పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల ఉద్యోగ వర్గాలకు మరింత వెసులుబాటు కలుగుతుంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాధారణ, రైల్వే బడ్జెట్‌ లను ఒకేసారి ప్రవేశ పెట్టడం..అలాగే నెల రోజుల ముందుగానే అంటే ఫిబ్రవరి ఒకటినే వీటిని పార్లమెంట్ ముందుంచాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో జైట్లీ బడ్జెట్‌ పై అన్ని వర్గాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వివిధ వ‌ర్గాలు ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను ఎత్తివేయాల‌ని కోరుతున్న నేప‌థ్యంలో నాలుగు ల‌క్ష‌ల‌కు దాన్ని ప‌రిమితం చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.అలాగే నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకూ, అలాగే డెబిట్ - క్రెడిట్ కార్డు చెల్లింపులపై మరిన్ని డిస్కౌంట్లు కల్పించేందుకూ జైట్లీ పలు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందరికీ ఆవాస కల్పనే లక్ష్యంగా ప్రకటించిన మోదీ సర్కార్ ఈ దిశగా కూడా పలు రాయితీలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొత్త బడ్జెట్‌లో పన్ను లబ్ధిని చేకూర్చే అవకాశమూ ఉంటుందని చెబుతున్నారు. నోట్ల రద్దు కారణంగా దారుణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకూ ఆర్ధిక మంత్రి కొంత వెసులుబాటు కల్పించవచ్చని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News