చైనాకు 2017 ప‌వ‌ర్ భార‌త్ చూపించ‌నుందా?

Update: 2017-07-05 10:32 GMT
స‌రిహ‌ద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్‌.. చైనాల మ‌ధ్య మాట‌లు తూటాల్లా పేలుతున్న సంగ‌తి తెలిసిందే. సిక్కిం.. భూటాన్‌.. టిబెట్ కూడ‌లి వ‌ద్ద డ్రాగ‌న్ దౌర్జన్యాన్ని భార‌త్ నిలువ‌రించేందుకు చేస్తున్న వైనంతో ఆ దేశం ఎంత‌లా కుత‌కుత‌లాడుతుందో తెలిసిందే.

ఉక్రోషం ఆపుకోలేని చైనా.. భార‌త్ ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేస్తోంది. దీనికి భార‌త్ సైతం ధీటుగా స‌మాధానం ఇస్తుండ‌టంతో చైనా ఆగ్ర‌హం మ‌రింత పెరుగుతోంది. ఎప్పుడూ లేని రీతిలో స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌కు భారీ భ‌ద్ర‌తా ద‌ళాల్ని మొహ‌రించ‌టంతో పాటు.. స‌ముద్ర‌జ‌లాల్లో త‌న స‌త్తా చాటుకునేలా యుద్ధ నౌక‌ల్ని.. జ‌లాంత‌ర్గామిల‌ను మొహ‌రిస్తోంది. ఈ విష‌యాన్ని గుర్తించిన భార‌త్ త‌న ప్ర‌య‌త్నాల్ని తాను షురూ చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ నెల 10 నుంచి బంగాళాఖాతంలో భార‌త్ - అమెరికా - జ‌పాన్ సంయుక్త విన్యాసాలు జ‌ర‌గ‌నున్నాయి. మ‌ల‌బార్ ఎక్స‌ర్ సైజ్ -21గా పిల‌వ‌నున్న ఈ విన్యాసాల్లో మూడు దేశాల‌కు చెందిన యుద్ధ నౌక‌ల్ని బ‌రిలోకి దించ‌నున్నారు. తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. భార‌త్ త‌న నౌకా బ‌లాన్ని చైనాకు చూపించే దిశ‌గా అడుగులు వేస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ మూడు దేశాల విన్యాసాల్లో సుమారు 15 యుద్ధ నౌక‌లు.. రెండు స‌బ్ మెరైన్లు.. పెద్ద ఎత్తున ఫైట‌ర్ జెట్ లు.. నిఘా విమానాల‌తో పాటు హెలికాఫ్ట‌ర్లు కూడా విన్యాసాల్లో పాల్గొన‌నున్నాయ‌ని చెబుతున్నారు.  బ‌లాబ‌లాలు చాటుకునే మ‌ల‌బార్ ఎక్స్ ర్ సైజుల్లో భాగంగా భార‌త్ టాప్ క్లాస్ యుద్ధ విమానాలు ఆరు నుంచి ఏడు వ‌ర‌కూ పాల్గొంటాయ‌ని చెబుతున్నారు. దేశంలోనే అత్యంత పెద్ద యుద్ధ నౌక ఐఎన్ ఎస్ విక్ర‌మాదిత్య త‌న స‌త్తాను చాటనుంది.  తాజా ఉద్రిక్త‌త‌ల న‌డుమ ప్ర‌పంచంలోనే మూడు కీల‌క దేశాలు నౌకా విన్యాసాలు నిర్వ‌హించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News