త‌లైవా గుస్సా!... ఇప్పుడు క్రికెట్ ఏంటీ?

Update: 2018-04-08 08:37 GMT
కావేరీ న‌దీ  జ‌లాల కోసం త‌మిళ తంబీలు ఇప్పుడు పెద్ద ఉద్య‌మ‌మే న‌డుపుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాపై వైసీపీ, టీడీపీ, చివ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలు న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై ప్ర‌తిపాదించిన అవిశ్వాస తీర్మానాలు చ‌ర్చ‌కు రాకుండా అన్నాడీఎంకే ఎంపీలు నాన్ స్టాప్‌గా పార్ల‌మెంటులో ఆందోళ‌న‌లు కొన‌సాగించిన వైనం మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. ఈ వ్య‌వ‌హారంలో మోదీ స‌ర్కారు వ్యూహం దాగున్నా... మొత్తంగా త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఆ రాష్ట్ర ఎంపీలు నిజంగానే పార్ల‌మెంటు స‌మావేశాల‌ను స్తంభింప‌జేశార‌నే చెప్పారు. క‌ర్ణాట‌క‌తో కావేరీ న‌దీ జలాల విష‌యంలో త‌మిళ‌నాడుకు ఏళ్ల త‌ర‌బ‌డి వివాదం కొన‌సాగుతూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు రెండు రాష్ట్రాలు ఈ విష‌యంపై క‌త్తులు దూయ‌డం - కేంద్ర ప్ర‌భుత్వ‌మో - లేదంటే సుప్రీంకోర్టో జోక్యం చేసుకోవ‌డం - అప్ప‌టిక‌ప్పుడు మాత్ర‌మే ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డం - తిరిగి ఆ వివాదం చెల‌రేగడం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం కావాల్సిందేన‌ని త‌మిళ పార్టీలు పెద్ద ఉద్య‌మానికే శ్రీ‌కారం చుట్టాయి.

రాష్ట్ర స‌మ‌స్య ప‌రిష్కారం కోసం అన్నాడీఎంకే ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో క‌లిసి మాట్లాడేందుకు విప‌క్ష డీఎంకే అగ్ర నేత‌లు ఏమాత్రం ప‌ట్టింపుల‌కు పోలేదు. డీఎంకే కార్యాచ‌ర‌ణ అధ్య‌క్షుడు స్టాలిన్ సీఎం ఆఫీస్‌ కు వెళితే... ఆయ‌న‌కు రెడ్‌ కార్పెట్ స్వాగ‌తం ప‌లికిన ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని సామి - డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం.. స్టాలిన్‌ ను త‌మ కార్యాల‌యంలో కూర్చోబెట్టి మ‌రీ చ‌ర్చ‌లు జ‌రిపారు. కావేరీ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం క‌లిసి ఉద్య‌మిద్దామ‌ని కూడా ఇరు పార్టీలు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఇటీవలే రాజ‌కీయాల్లోకి దిగేసిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చాలా వెరైటీగా ఎంట్రీ ఇచ్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిర‌స‌న‌ల‌కు అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలో సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు కూడా ఈ ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇప్ప‌టికే డీఎంకే రాష్ట్ర బంద్ నిర్వ‌హించ‌గా... తాజాగా ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ కు పీఎంకే పిలుపునిచ్చింది. ఈ పిలుపున‌కు కూడా అన్ని వ‌ర్గాలు వ‌రుస‌గా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే ఎంట్రీ ఇచ్చిన త‌మిళ తంబీలంతా త‌లైవా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ర‌జనీకాంత్‌... దాదాపుగా గ‌ర్జిస్తున్న‌ట్లుగానే ఎంట్రీ ఇచ్చేశార‌ని చెప్పాలి.

ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే, రైతుల కోసం పోరాడే సమయంలో ఐపీఎల్ జ‌రగడం ఇబ్బందికరమని ర‌జ‌నీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కావేరీ నదీ జలాల కోసం నిరసన తెలియజేస్తున్న సమయంలో ఐపీఎల్ పోటీలు ఏమిటంటూ గ‌ర్జించారు.  ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ పోటీలు తనకు ఇబ్బందిని, చిరాకును తెప్పిస్తున్నాయన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, అభిమానులు కావేరీ నీటి కోసం, ప్రజల ఆందోళనకు మద్దతుగా నల్ల బ్యాడ్జిలు ధరించి మ్యాచులు ఆడాలని ఆయ‌న దాదాపుగా అల్టిమేటం జారీ చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయకుంటే తమిళ ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని రజనీ.... ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించాల‌ని కూడా డిమాండ్ చేశారు. మొత్తంగా కాస్తంత లేటుగానే అయినా... లేటెస్ట్‌గా ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు కావేరీ న‌దీ జ‌లాల కోసం తంబీలు చేస్తున్న ఉద్య‌మం మ‌రింత ఉధృతం కానుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News