నిజంగానే చంద్రబాబు భయపడుతున్నారా ?

Update: 2021-12-12 09:15 GMT
తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతూ తనలాంటి వారిని దూరం చేసుకుంటే చంద్రబాబుకే నష్టమన్నారు. వంశీ మాటలు విన్న తర్వాత చంద్రబాబుకు జరిగే నష్టం గురించి చెబుతున్నట్లు కాకుండా చంద్రబాబునే బెదిరిస్తున్నట్లుంది.  ఇంతకీ వంశీ చెప్పిన ప్రకారం చంద్రబాబుకు జరిగే నష్టం ఏమిటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందట.

సాంకేతికంగా చూస్తే వంశీ ఇప్పటికీ టీడీపీ ఎంఎల్ఏనే అనడంలో సందేహం లేదు. చంద్రబాబుతో విభేదాల కారణంగా పార్టీకి దూరంగా తన అవసరాల కోసం వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారంతే. ఒకటి మాత్రం వాస్తవమని అంగీకరించాల్సిందే. అదేమిటంటే ఎవరిమీద కూడా  యాక్షన్ తీసుకునేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు మీద కోపంతో వాళ్ళంతట వాళ్ళుగా పార్టీకి దూరమైపోవాలే కానీ ఎవరి మీదా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు.

ఇక వంశీ చెప్పిన కారణాన్ని ఒకసారి పరిశీలిద్దాం. చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవాలంటే అసెంబ్లీలో టీడీపీ బలం 17కన్నా తక్కువకు పడిపోవాలి. ప్రోటోకాల్ ప్రకారం సీఎం తర్వాత ప్రాధాన్యత ప్రధాన ప్రతిపక్ష నేతకే ఉంటుంది. ఇపుడు టీడీపీ బలం టెక్నికల్ గా 23. అంటే వంశీపై యాక్షన్ తీసుకున్నంత మాత్రాన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష హోదాకు వచ్చిన సమస్యేమీ లేదు. వంశీతో పాటు టీడీపీకి కరణం బలరామ్, వాసుపల్లి గణేష్, మద్దాలిగిరి దూరంగానే ఉంటున్నారు.

ఇక గంటా శ్రీనివాసరావు పార్టీలో ఉన్నారో లేదో ఆయనకే తెలియాలి. పార్టీకి దూరమైన ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేయాలని చంద్రబాబు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసేంత వరకు వాళ్ళంతా టెక్నికల్ గా టీడీపీ ఎంఎల్ఏల క్రిందే లెక్క. అనర్హత వేటు విషయంలో చంద్రబాబు ఫిర్యాదు చేసేది లేదు స్పీకర్ చర్యలు తీసుకునేదీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన రెండున్నరేళ్ళూ వాళ్ళంతా టీడీపీ ఎంఎల్ఏలుగానే కంటిన్యూ అయిపోతారు.

కాబట్టి చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా విషయంలో వంశీ చెప్పింది తప్పనే అనుకోవాలి. కాకపోతే యాక్షన్ తీసుకోమని ఫిర్యాదు చేయటానికి తాను ఎందుకు వెనకాడుతున్నారనే విషయాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే చెప్పాలి. పిల్లి-ఎలుక సామెతలో చెప్పినట్లుగా ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబును బెదిరిస్తున్న కారణం ఎవరి మీదా యాక్షన్ తీసుకోలేని భయమే.
Tags:    

Similar News