సిద్ధూ శాంతించినట్లేనా ?

Update: 2021-07-01 13:30 GMT
కొంతకాలంగా ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న పంజాబ్ కాంగ్రెస్ గొడవలు ఒక కొలిక్కి వచ్చినట్లేనా ? ఢిల్లీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఎంఎల్ఏ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. మరోవైపు ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి.

వీళ్ళ మధ్య వివాదాలను పరిష్కరించేందుకు అధిష్టానం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే చివరి అస్త్రంగా అధిష్టానం రెడీ చేసిన రాజీమార్గానికి సిద్ధు హ్యాపీగా ఫీలవుతున్నారట. ఇంతకీ ఆ మార్గం ఏమిటంటే సిద్ధూకి పంజాబ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించటం. ఎప్పటినుండో సిద్ధూ పీసీసీ అధ్యక్ష పదవినే కోరుకుంటున్నారు. అయితే అమరీందర్ దీనికి అడ్డుగా నిలుస్తున్నారు.

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను గమనిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపై జనాలు మండిపోతున్నారు. ముఖ్యంగా కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ బిల్లులకు రైతాంగం తీవ్ర వ్యతిరేకంగా ఉంది. రైతుల వ్యతిరేక ఆందోళనలకు పంజాబే కీలకంగా మారింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం దాదాపు కష్టమనే చెప్పాలి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ గనుక కలిసికట్టుగా ఉంటే మళ్ళీ అధికారంలోకి రావటం ఏమంత కష్టంకాదు. కాకపోతే అమరీందర్-సిద్ధూ వర్గాల ఐక్యంగా పోరాడాలి.

ఇదే విషయాన్ని అధిష్టానం ఇద్దరు నేతలకు గట్టిగానే తలంటిపోసి చెప్పిందట. అధికారంలో ఉంటేనే కదా ఏ వివాదమైనా. అధికారంలో నుండి దిగిపోయి ప్రతిపక్షంలోకి వస్తే నేతలను పట్టించుకునేదెవరు ? ఇదే విషయాన్ని చెప్పాల్సిన పద్దతిలో అధిష్టానం చెప్పటంతో ఇద్దరు దారిలోకి వచ్చారట. ఎలాగూ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి కూడా రాజీమార్గానికి సుముఖంగానే ఉన్నారు. రెండు మూడు రోజుల్లోనే సిద్ధూ పదవి విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారట. చూద్దాం తర్వాత ఏమి జరుగుతుందో.
Tags:    

Similar News