మరోమారు బయటపడ్డ మహిళా మంత్రి, ఎంపీ మధ్య విభేదాలు!

Update: 2022-10-27 05:10 GMT
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద లక్ష్యాన్నే పెట్టుకున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలను, నియోజకవర్గాల ఇన్‌చార్జులను ప్రతి ఇంటికీ తిప్పుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో జగన్‌ భేటీ అవుతున్నారు. 175కి 175 సీట్లు సాధించాలని కర్తవ్యాన్ని ఉపదేశిస్తున్నారు.

అయితే అదంత తేలికగా కనిపించడం లేదు. పలు నియోజకవర్గాల్లో వైసీపీలో అసమ్మతి బ రంగంగానే కనిపిస్తోంది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో 175కి 175 ఏమో కానీ అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు.

రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా తర్వాత అత్యధిక సీట్లున్న గుంటూరు జిల్లాలో వైసీపీలో అసమ్మతి పోరు ఉంది. ఇటీవల ఈ కారణంతోనే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణను వైసీపీ నుంచి బహిష్కరించారు.

ఇప్పుడు నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని వార్తలు వచ్చాయి. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చిలకలూరిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మొదటి నుంచీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని టాక్‌ నడుస్తోంది.

తన నియోజకవర్గంలో పరిధిలో ఎంపీ లావుకు ఏం పని అని రజిని, అలాగే లోక్‌సభా నియోజకవర్గంలో ఆమెకు పని ఏంటని లావు ఒకరికొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారని టాక్‌. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్‌ గతంలోనే వీరిద్దరికీ క్లాస్‌ తీసుకున్నారని ప్రచారం జరిగింది.

అయినా సరే ఇప్పుడు మరోమారు విభేదాలు బయటపడ్డాయని మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోగల లింగంగుంట్లలో 200 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి విడదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరూ హాజరయ్యారు. అయితే సమావేశంలో ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదని చెబుతున్నారు. మంత్రి తన ప్రసంగం ముగియగానే ఎంపీని పట్టించుకోకుండా వెళ్లిపోయారని చెబుతున్నారు.

దీంతో లావు శ్రీకృష్ణదేవరాయలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు మంత్రి విడదల రజిని తాను మంత్రిగా రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. తనను తమ నియోజకవర్గాల్లో పర్యటించవద్దని అంటే ఎలా అని నిలదీస్తున్నట్టు సమాచారం.

వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం కూడా లేని నేపథ్యంలో వీరిద్దరి పోరు వైసీపీని ఏ తీరాలకు చేరుస్తుందో వేచిచూడాల్సిందే.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News