జ‌గ‌న్ హ‌త్యాయ‌త్నంపై రిమాండ్ లో ఏమ‌ని చెప్పారంటే?

Update: 2018-10-29 05:17 GMT
విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన హ‌త్యాయ‌త్నంపై తాజాగా ఏపీ పోలీసులు రిమాండ్ నోట్ ను సిద్ధం చేశారు. జ‌గ‌న్ పై దాడి చేసిన శ్రీ‌నివాస‌రావును కోర్టుకు అప్ప‌గించిన స‌మ‌యంలో రిమాండ్ నోట్‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు. దీనికి సంబంధించిన వివ‌రాల్ని ఒక మీడియా సంస్థ ప్ర‌చురించింది. వాటిలో ఉన్న అంశాలు ఒక ఎత్తు అయితే.. ఈ రిమాండ్ నోట్ చ‌దివిన త‌ర్వాత కొత్త సందేహాలు రావ‌టం ఖాయం.
రిమాండ్ నోట్‌ లో ఏమేం విష‌యాలు ఉన్నాయంటే..

+  జగన్‌ కు వీరాభిమాని అయిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన శ్రీనివాసరావు ఇంటర్‌ మధ్యలోనే ఆపేసి దుబాయి వెళ్లి కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ఏడాది కిందట విశాఖ ఎయిర్‌ పోర్టులో ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ లో కుక్‌ గా చేరాడు.

+  అక్కడ పని చేస్తున్న మరో ఇద్దరితో కలిసి సమీపంలోని విమాననగర్‌ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ప్రభుత్వ పథకాల అమలు తీరు - రాష్ట్రం లో పరిస్థితులపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శ్రీనివాసరావు - వచ్చే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు.

+  అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి తయారు చేసిన లేఖను జగన్‌ కు అందజేయాలని భావించాడు. తనకు సోదరి అయ్యే విజయలక్ష్మి - తనతోపాటు రెస్టారెంట్‌ లో పని చేస్తున్న రేవతీపతి సహాయంతో 11పేజీల లేఖను సిద్ధం చేశాడు.

+  మామూలుగా ఇస్తే జగన్‌ దానిని పట్టించుకోరు కాబట్టి ఏదైనా సంచలనం సృష్టించడం ద్వారా తన ఆశయం అమలు చేయాలని భావించాడు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ - హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి విశాఖ నుంచి ప్రతి గురువారం విమానంలో వెళ్లడాన్ని శ్రీనివాసరావు కొంతకాలంగా గమనిస్తున్నాడు.

+  తాను అనుకున్న ‘సంచలన’ సంఘటనను అమలు చేయడానికి కోడిపందేలకు ఉపయోగించే కత్తితో పాటు మరొక చిన్నపాటి కత్తిని ఈనెల 23న ఎయిర్‌ పోర్టు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలకు తీసుకెళ్లాడు. 25న మధ్యాహ్నం జగన్‌ ఎయిర్‌పోర్టుకు రావడంతో తన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

+  12.40 గంటలకు పార్టీ నేతల సూచన మేరకు మహిళా వెయిటర్‌ రమాదేవి టీ తీసుకుని జగన్‌ వద్దకు వచ్చారు.  టీ వద్దని కాఫీ తేవాలని చెప్పడంతో ఆమె తిరిగి వెనక్కి వెళ్లగా - అక్కడే వాటర్‌ బాటిల్‌ పట్టుకుని నిలబడి ఉన్న శ్రీనివాసరావు - భద్రతా సిబ్బందిని దాటుకుని జగన్‌ సమీపంలోకి వచ్చి నిలబడ్డాడు.

+  కాఫీ తాగిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ కాల్‌ రావడంతో విమానం ఎక్కడానికి జగన్‌ లేచి వెళ్లబోతుండగా సెల్ఫీ కావాలని కోరాడు. జగన్‌ పక్కన అతను నిలబడి ఉండగా - మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తన సెల్‌ తో ఫొటో తీయబోయారు. ఇంతలో శ్రీనివాసరావు తన జేబులోని కోడికత్తిని తీసి దాడిచేశాడు.

+  అప్రమత్తమైన జగన్‌... కుడివైపు తిరగడంతో కత్తి ఎడమ భుజంపై దిగింది. వెంటనే అక్కడే ఉన్న పార్టీనేత చిన్నశ్రీను - ప్రొటోకాల్‌ భద్రతా సిబ్బంది - సీఐఎస్ ఎఫ్‌ అధికారులు అప్రమత్తమై శ్రీనివాసరావు చేతిలో కత్తిని లాక్కొని - అతడిని అదుపులోకి తీసుకున్నారు.

+  ఈ సమయంలో అతను ముందుగానే రాసుకుని జేబులో పెట్టుకున్న 11పేజీల లేఖను బయటకు విసిరేశాడు. చిన్నశ్రీను కత్తిని తీసుకుని దానికి ఏమైనా విషం పూశారేమోనని పరీక్షించేందుకు బయటకు తీసుకెళ్లి, కొద్దిసేపటి తరువాత తిరిగి తీసుకువచ్చారు. సీఐఎస్ ఎఫ్‌ అధికారులు సెల్‌ ఫోన్‌ - రెండు సిమ్‌ కార్డులు - ఒక డెబిట్‌ కార్డును స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వాటితో పాటు శ్రీనివాసరావుని పోలీసులకు అప్పగించారు.

రిమాండ్ నోట్ ను చ‌దివిన త‌ర్వాత స‌గ‌టు జీవికి వ‌చ్చే సందేహాల్ని చూస్తే..

+ రిమాండ్ నోట్ లో జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం చేసిన అనంత‌రం త‌న జేబులో పెట్టుకున్న 11 పేజీ లేఖ‌ను బ‌య‌ట‌కు విసిరేసిన‌ట్లుగా పేర్కొన్నారు. దాడి జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డే ఉన్న  ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు కానీ.. మీడియా రిపోర్టుల్లో ఎక్క‌డా అలాంటిది పేర్కొన్న‌ది లేదు. ఒక‌వేళ నిజంగానే అలా జ‌రిగింద‌ని అనుకుందాం. అదే జ‌రిగితే.. ఆ లేఖ‌ను ఎవ‌రో ఒక‌రు త‌మ సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే వారు క‌దా? అదిప్ప‌టికి వైర‌ల్ అయ్యేది క‌దా?

+  లేఖ‌ను తాము స్వాధీనం చేసుకున్న‌ట్లుగా డీజీపీ పేర్కొన్నారే కానీ...నిందితుడు త‌న దాడి అనంత‌రం లేఖ‌నుబ‌య‌ట‌కు విసిరేసిన‌ట్లుగా పేర్కొన‌లేదు. కానీ.. రిమాండ్ నోట్‌ లో అందుకు భిన్నంగా ప్ర‌స్తావించ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

+  జ‌గ‌న్ పై దాడికి ఉప‌యోగించిన క‌త్తిని చిన్న శ్రీ‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లి విషం పూశారేమోన‌ని ప‌రీక్షించార‌ని రిమాండ్ నోట్‌లో పేర్కొన్నారు. అదే జ‌రిగిన‌ప్పుడు.. శ్రీ‌నివాస‌రావు త‌న జేబులో పెట్టుకున్న 11 పేజీల లేఖ‌ను బ‌య‌ట‌కు విసిరేస్తే.. క‌చ్ఛితంగా ఆ లేఖ‌ను జ‌గ‌న్ చుట్టూ ఉన్న నేత‌ల్లో ఎవ‌రో ఒక‌రు పోలీసుల‌కు అందించి ఉంటారు క‌దా?  అదే జ‌రిగి ఉంటే.. ఆ లేఖ‌లోని అంశాలు వెంట‌నే బ‌హిర్గ‌త‌మ‌య్యేవి క‌దా?

+ ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కారం ప‌ది నెల‌లుగా ఎయిర్ పోర్ట్ లో మ‌కాం వేయించి.. అండ‌గా నిలిచింది ఎవ‌రు?  కుట్ర కోణం వెనుక ఎవ‌రు ఉన్నారు? అన్న విష‌యాలు రిమాండ్ రిపోర్ట్ లో లేవు.

+ ఏడాది కాలంలో శ్రీ‌నివాస‌రావు తొమ్మిది ఫోన్లు మార్చార‌ని.. తొమ్మిది సిమ్ కార్డుల‌తో మొత్తం ప‌ది వేలకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడార‌ని.. మూడు జాతీయ బ్యాంకుల్లో అత‌ని అకౌంట్లు ఉన్న‌ట్లు విశాఖ న‌గ‌ర క‌మిష‌న‌ర్ మ‌హేశ్ చంద్ర ల‌డ్డా చెప్పారు. మ‌రీ.. అంశాల‌పై పోలీసుల విచార‌ణ ఏమిట‌న్న‌ది పేర్కొన‌లేదు.

+  పేద కుటుంబ నేప‌థ్యంగా చెప్పే శ్రీ‌నివాస‌రావు ఇటీవ‌ల కాలంలో విచ్చ‌ల విడిగా ఖ‌ర్చులు చేస్తున్న వైనాన్ని సొంతూరు ప్ర‌జ‌లు చెబుతున్న‌ప్పుడు.. అంత డ‌బ్బు ఎక్క‌డినుంచి వ‌చ్చింది?  దాని వెనుక ఉన్న బ‌డాబాబులు ఎవ‌రు? అన్న‌ది తేల్చ‌ని ప‌రిస్థితి.

+ జ‌గ‌న్ హ‌త్యాయ‌త్నంపై న‌మోదు చేసిన సెక్ష‌న్లు ప‌లు అనుమానాల‌కు తావిచ్చేలా ఉన్నాయి. హ‌త్యాయ‌త్నం అంటూ ఐపీసీ సెక్ష‌న్ 307మాత్ర‌మే కేసు న‌మోదు చేశారు. కుట్రదారులు ఎవ‌రు? ఈ ప్లాన్ సూత్ర‌ధారుల్ని బ‌య‌ట‌పెట్టేందుకు అవ‌కాశం ఉన్న ఐపీసీ సెక్ష‌న్ 120 బి కింద కేసు న‌మోదు చేసి విచారించాల్సి ఉంది. మ‌రి.. ఆ ప‌ని ఎందుకు చేయ‌న‌ట్లు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.
Tags:    

Similar News