యుద్ధం బాబుతో కాదు.. ఆ నాలుగు మీడియా సంస్థలతో.. జగన్ నోట అదే మాట

Update: 2022-04-28 05:31 GMT
కాలం మారింది. యుద్ధం స్టైల్ మారింది. గతంలో కత్తులు.. కఠారులు పట్టుకొని బలప్రదర్శనతో లెక్కలు తేల్చేసేవారు. ఆ తర్వాతి కాలంలో కత్తులతో ఫైటింగ్ చేస్తున్న వారిపై తుపాకులు ఎక్కుపెట్టటం ద్వారా అప్ గ్రేడ్ చేసుకున్న వారి చేతికి అధిపత్యం దక్కింది. అది వందల ఏళ్లు సాగింది. ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ యుగం. దానికి తగ్గట్లే యుద్ధ తంత్రం ఉండాలి. కత్తులు.. ముందుగుండు సామాగ్రితో యుద్ధాన్ని గెలిచే కన్నా.. మైండ్ గేమ్ తో యుద్ధాన్ని గెలిస్తే ఆ మజానే వేరుంటుంది. చిన్న రక్తం బొట్టు చిందని రీతిలో ప్రత్యర్థుల్ని మానసికంగా దెబ్బ తీసి.. వారికి వారు నిర్వీర్యం అయ్యేలా చేస్తే అంతకు మించింది ఏముంటుంది? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరికొత్త రణతంత్రం కూడా ఇదే రీతిలో ఉందా? అంటే.. ఇంచుమించు ఇలానే ఉందన్న మాట వినిపిస్తోంది.

అదెలా అన్న విషయానికి వచ్చినప్పుడు కొందరు నోటి నుంచి వచ్చేమాటల్ని గుర్తు చేసుకుంటే విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే అతడ్నే నేరుగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అతడి బలం మీదా.. అతడికి దన్నుగా ఉన్న వారిని దెబ్బ కొడితే సరిపోతుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు వింటే ఇదే విషయం అర్థమవుతుంది. ఇటీవల  కాలంలో ఆయన తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు పేరును ప్రస్తావించటం మానేశారు. కీలక సమావేశాల్లో ఆయన చంద్రబాబు పేరు కంటే కూడా ఆయనకు మద్దతు ఇస్తారన్న ప్రచారం జరిగే మీడియా సంస్థల ప్రస్తావన తీసుకొస్తున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు పేరు ప్రస్తావించకపోవటం ద్వారా.. ఆయన తన ప్రత్యర్థి కానేకాదని స్పష్టం చేయటం. అదే సమయంలో చంద్రబాబుకు దన్నుగా నిలిచే నాలుగు మీడియా సంస్థలే తమ ప్రత్యర్థులు అనటం ద్వారా.. ఆ నాలుగు మీడియా సంస్థల కంటే చంద్రబాబు బలహీనుడన్న అర్థాన్ని వచ్చేలా చేయటమని చెప్పొచ్చు. అంతేకాదు.. బలహీనుడైన చంద్రబాబు తో కాకుండా బలమైన మీడియాతో యుద్ధం చేస్తున్నట్లు చెప్పటం ద్వారా సరికొత్త రాజకీయ ఎత్తుగడను జగన్ వేస్తున్నట్లు చెబుతున్నారు.

సీఎం జగన్ మాటల్ని చూస్తే.. ఆయనవన్నీ కూడా మైండ్ గేమ్ మాటల మాదిరే కనిపిస్తాయి. ఎదుటి వారిని మాటలతో నిరుత్సాహానికి గురి చేయటం.. వారు అలాంటి కండీషన్ లో ఉన్నప్పుడు బలమైన టాస్కు ఇచ్చి.. వారు మరింత బలహీనపడేలా చేసే ఎత్తుగడను ఆయన వేస్తున్నట్లుగా చెప్పాలి. నిజానికి ఒక రాజకీయ పార్టీతో పోలిస్తే.. ఒక మీడియా సంస్థ ప్రజల నిర్ణయాల్ని.. అభిప్రాయాల్ని పూర్తిగా మార్చలేదు. కాకుంటే.. ఒక బలమైన రాజకీయ పక్షం మాటల్ని ప్రజలు నమ్మేలా చేయటంలో కీ రోల్ ప్లే చేసే వీలుంది. ఆ విషయం అందరికి తెలిసిందే.

గతంలో పరిస్థితి వేరు కానీ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మీడియా మీద గతంలో ఉన్ననమ్మకం.. విశ్వాసం లాంటివి ప్రజల్లో సడలి చాలా కాలమే అయ్యింది. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను అనుమానించేలా చేయటాన్ని వైఎస్ మొదలు పెడితే.. జగన్ ఇప్పుడు పూర్తి చేసే వరకు వచ్చేశారు. చంద్రబాబుకు బలమేలేదని.. ఆయన పూర్తిగా బలహీనుడని.. ఆయన పని అయిపోయిందన్న భావన కలిగేలా జగన్ మాటలు కనిపిస్తాయి.

అదే సమయలో.. బలహీనమైన చంద్రబాబును లేపే ప్రయత్నం చేసే నాలుగు మీడియా సంస్థలను బలహీనపరిస్తే సరిపోతుందని చెప్పటం ద్వారా.. ఒక దెబ్బకు రెండు పిట్టలన్న సామెతను ఫాలో అవుతున్నట్లు చెప్పాలి. ఇప్పుడు తన గురి మొత్తం నాలుగు  మీడియా సంస్థల మీద పెట్టటం ద్వారా.. వారిని బద్నాం చేయటం ద్వారా.. వారు ఆత్మరక్షణలో పడతారు. తమ సచ్ఛీలతను ప్రదర్శించుకునేందుకు తహతహలాడుతారు. అసలు విషయాన్ని పక్కన పెడతారు. నిజానికి జగన్ కు కావాల్సింది కూడా అదే. అందుకే.. ఆయన నోటినుంచి నాలుగు మీడియా సంస్థల్ని దుష్ట చతుష్టయంగా వ్యవహరించేదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News