విజయశాంతికి జగ్గారెడ్డి ఆశీర్వాదం!

Update: 2019-05-08 10:42 GMT
తను చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన రాములమ్మకు తను కౌంటర్లు ఇచ్చేది లేదంటూనే.. ఆమెపై ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ - జగన్ లను కలుపుకుని మాట్లాడుతున్న జగ్గారెడ్డి తీరుపై విజయశాంతి ఫైర్ అయ్యింది. దీంతో ఆమెకు ఈయన కౌంటర్లు ఇవ్వక తప్పలేదు.

అయితే కౌంటర్లు ఇవ్వడం లేదంటూనే కౌంటర్లు ఇచ్చారీయన. 'విజయశాంతికి మంచి భవిష్యత్తు ఉంది. ఆమె రాజకీయానికి ఎక్కువ సమయం కేటాయిస్తే బావుంటుంది..' అంటూ పంచ్ వేశారు జగ్గారెడ్డి. విజయశాంతి విరామాలతో రాజకీయాలు చేస్తూ ఉన్న విషయాన్ని ఆయన ఇలా ప్రస్తావించారు. విజయశాంతి ఏకధాటిగా రాజకీయాల్లో ఉండరు. కొంతకాలం బాగా హడావుడి చేయడం ఆ తర్వాత తెరమరుగు కావడం ఆమెకు అలవాటే.

ఆ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ..'ఆమె ఎక్కువ సమయం పార్టీకి కేటాయిస్తే బావుంటుంది..' అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

అంతే కాదు ఆ నటీమణికి పీసీసీ చీఫ్ కావాలనే ఆశ ఉందని కూడా జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. 'విజయశాంతి పీసీసీ చీఫ్ కావాలని అనుకుంటున్నారు. ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ అవుతార కూడా. ఆమె బాగా కష్టపడాలి..' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా విజయశాంతిని ఆశీర్వదిస్తున్నట్టుగానే మాట్లాడి, ఆమె తనపై చేసిన వ్యాఖ్యల వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయంటూ, ఆమె పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని, దక్షిణాదిన పార్టీ బలోపేతానికి విజయశాంతిని ఉపయోగించుకోవాలని జగ్గారెడ్డి అధిష్టానానికి కూడా ఒక ఉచిత సలహా ఇచ్చేశారు. పార్టీ కోసం ఎవరెవరు పని చేస్తున్నారు అనే అంశం గురించి తను రాహుల్ గాంధీకి ఒక లేఖ రాయబోతున్నట్టుగా కూడా జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు!
Tags:    

Similar News